Kurnool | ప్రైవేట్ బస్సులో మంటలు

Kurnool | ప్రైవేట్ బస్సులో మంటలు
- డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన భారీ ముప్పు
- పులదుర్తి గ్రామ సమీపంలో ఘటన
Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రైవేట్ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో శనివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా , పత్తికొండ సమీపంలో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నాటకకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సకాలంలో స్పందించడంతో బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడి ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మంత్రాలయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పత్తికొండ సమీపంలోకి రాగానే ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులను అప్రమత్తం చేస్తూ వేగంగా బస్సు దిగమని సూచించారు. డ్రైవర్ హెచ్చరికతో ప్రయాణికులంతా ఎలాంటి గందరగోళం లేకుండా కిందకు దిగడంతో ప్రాణనష్టం తప్పింది.
ప్రయాణికులు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులను మరో బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు.
ఇటీవల ఇదే జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇంకా ప్రజల మదిలో నిలిచిపోయిన తరుణంలో, తాజాగా పత్తికొండ సమీపంలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదం ప్రయాణికుల్లో భయాందోళనలను మరింత పెంచుతోంది. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వహణ, వాహనాల సాంకేతిక తనిఖీలపై తీవ్ర సందేహాలను కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా దీర్ఘదూర ప్రయాణాలు చేసే ప్రైవేట్ బస్సుల్లో ఇంజిన్ భద్రత, అగ్నిమాపక పరికరాల లభ్యత, డ్రైవర్ల శిక్షణ వంటి అంశాలపై అధికారుల పర్యవేక్షణ అవసరమని ప్రయాణికులు కోరుతున్నారు. చిన్నటేకూరు ఘటన నుంచి పత్తికొండ గ్రామ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం వరకు వరుస సంఘటనలు చోటు చేసుకోవడం, రవాణా భద్రతపై పునరాలోచన చేయాల్సిన అవసరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ప్రాణ నష్టం జరగకపోయినా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
