AP | కుప్పం మున్సిపాలిటీ టీడీపీ కైవసం

కుప్పం, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పురపాలక సంఘం పాలకవర్గం ఈరోజు తెలుగుదేశం పార్టీ పరమైంది. 25 వార్డులున్న కుప్పం పురపాలక సంఘానికి రెండేళ్ల క్రితం జరిగిన తొలి ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీకి 19స్థానాలు, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి 6 స్థానాలు లభించాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ముందుగా వైసీపీకి చెందిన చైర్మన్ సుధీర్ తన పోస్టుకు, కౌన్సిలర్ పదవికి ఆరు నెలల క్రితమే రాజీనామా చేశారు. ఆయన వెంట మరో ఐదుగురు కౌన్సిలర్లు వైసీపీకి మాత్రం రాజీనామాలు చేశారు.

ఈనేపథ్యంలో గత నెలలో కుప్పం మునిసిపాలిటీ పాలకమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అప్పటి నుంచి వైసీపీకి చెందిన ఎం ఎల్ సి భరత్, టీడీపీకి చెందిన ఎంఎల్ సి శ్రీకాంత్ వ్యూహ ప్రతివ్యూహాల రాజకీయాలు ఊపందుకున్నాయి. చైర్మన్ సుధీర్ రాజీనామాతో కౌన్సిలర్ల సంఖ్య 24తగ్గగా, ఎమ్మెల్సీలు శ్రీకాంత్, భరత్ లు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఎవరు విజయం సాధించాలన్నా 14మంది సభ్యుల మద్దతు అవసరం ఉండే దశలో ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి తెలుగుదేశం పార్టీ బలం 10కి పెరిగింది.

అయినా పురపాలికను కైవసం చేసుకోవ‌డానికి తెలుగుదేశం పార్టీకి మరో నలుగురు అవసరమయ్యే దశలో ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఎన్నిక జరిగే సమయానికి వైసీపీ నుంచి మరో నలుగురు కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆ పార్టీ గెలుపు సుగమమైంది. ఈరోజు జరిగిన ఎన్నికల్లో 14మంది కౌన్సిలర్ల మద్దతుతో కుప్పం పురపాలక సంఘాన్ని గెలుచుకున్న తెలుగుదేశం తమ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ సెల్వరాజ్ ను చైర్మన్ గా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *