TG| ఈనెల‌20 నుంచి కేటీఆర్ స‌మ‌ర‌శంఖం… రాష్ట్రవ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి 25సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వరంగల్‌లో లక్షలాది మంది పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించనున్న‌ట్లు పార్టీ ప్రకటించింది.

పార్టీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు, సంబరాలను నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించబడింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వేటిని అమలు చేయకుండా వంచిస్తున్న తీరుపై కూడా చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ శ్రేణులకు, జిల్లా నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ స్వయంగా మార్గదర్శనం చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈనెల‌ 20న సూర్యాపేట జిల్లా కార్యకర్తలతో, 23న కరీంనగర్ జిల్లా నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. 14 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంతో పాటు, పదేండ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ సమాజంతో బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకున్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సమావేశాల సందర్భంగా మరోసారి గుర్తుచేసుకోనున్నారు.

పార్టీకి ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకుని నిలబడ్డ పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో మళ్లీ ఉజ్వల భవిష్యత్తు ఉండబోతున్న విషయాన్ని కేటీఆర్ తెలియజేయనున్నారు. ఏడాదిన్నరలోనే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని, తెలంగాణ ప్రజల భరోసా ఇప్పుడు బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పైనే ఉన్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *