ఎవ్వరైనా కలవొచ్చు

ప్రతి క్షణం అందుబాటులో ఉంటా

నేర రహిత జిల్లానే లక్ష్యం

చట్లాన్ని ఉల్లంఘిస్తే సహించం

కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

 ( ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి) 

చట్టాన్ని ఉల్లంఘిస్తే సహించం. అసాంఘిక శక్తులను వదలం.అసాంఘిక శక్తులపై   ఉక్కుపాదం తప్సదు. తప్పు చేస్తే తాట తీసే  దిశగా కార్యాచరణ ఉంటుంది, అని  కృష్ణాజిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు.  కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా సోమవారం (15.09.25న)  విద్యా సాగర్ నాయుడు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆర్. గంగాధర రావు  కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించగా సాధారణ బదిలీలు లో  అన్నమయ్య జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న  వి. విద్యా సాగర్ నాయుడు  బదిలీపై కృష్ణాజిల్లాకు వచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో  నూతన ఎస్పీకి  సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. వేదమంత్రాలు నడుమ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీని  అడిషనల్ ఎస్పీ అడ్మిన్  వీవీ.నాయుడు,  ఏ.ఆర్ అడిషనల్ ఎస్.పి సత్యనారాయణ, డిఎస్పీలు, పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ,  శాంతి భద్రతలను పరిరక్షించడంలో, ప్రజా సమస్యల పరిష్కారంలో, మహిళల భద్రతను పెంచడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించడమే తన  ప్రధాన లక్ష్యమన్నారు. గంజాయి , ఇతర మాదక ద్రవ్యాలను జిల్లాలోకి ప్రవేశించకుండా ఉక్కు పాదం మోపుతాం. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడంలో ప్రత్యేక పాత్రను పోషిస్తానని ఎస్పీ స్పష్టం చేశారు.  సిబ్బంది సంక్షేమం లో రాజీ పడేది లేదు.  సిబ్బంది సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తానన్నారు.  ఎంతో ప్రఖ్యాత చరిత్ర కలిగిన కృష్ణాజిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందని, ప్రజా సంక్షేమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను అనుసరించి విధి నిర్వహణ కనపరుస్తానని, ప్రత్యేకంగా మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు.  జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు సిబ్బందిని ఎల్లవేళలా అప్రమత్తం చేస్తూ, సిబ్బంది సమస్యల పరిష్కారం లో ఎల్లవేళలా ముందు ఉంటానని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. చిన్నారులు, వృద్ధులకు, మహిళలకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఎంతో మందికి దక్కని అదృష్టాన్ని దేవుడు మనకి పోలీస్ ఉద్యోగం ద్వారా అందించాడు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అహర్నిశలు ప్రజా సేవలో నిమగ్నం అవుతామని, ప్రజా సమస్యలను పరిరక్షించడంలో కృష్ణాజిల్లా ముందుంటుందని తెలిపారు.  శాంతి భద్రతల పరిరక్షణలో స్థాయి భేదం చూపించకుండా సిబ్బందితోపాటు ముందుంటానని, ఏ సమస్య ఉన్న నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.  నూతన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు  2016 లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ద్వారా పోలీస్ శాఖలోకి అడుగుపెట్టి అసాల్ట్ కమాండర్ గ్రేహౌండ్స్, అసిస్టెంట్ సూపరింటెండెంట్  ఆఫ్ పోలీస్ చింతపల్లి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ విశాఖపట్నం, సూపరింటెండెంట్ ఆఫ్  పోలీస్  గ్రేహౌండ్స్, అన్నమయ్యజిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా  బాధ్యతలు నిర్వహించారు.

Leave a Reply