Kotabommali | సంప్రదాయ సోయగాలు… సంక్రాంతి సంబరాలు

Kotabommali | సంప్రదాయ సోయగాలు… సంక్రాంతి సంబరాలు

  • భోగిమంట వెలిగించి ప్రారంభించిన మంత్రి అచ్చెన్న
  • అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

Kotabommali | కోట‌బొమ్మాళి, ఆంధ్రప్రభ : తెలుగువారి సంస్కృతి సంప్రదాయ సోయగాలు వెల్లి విరిశాయి… సంక్రాంతి వైభవాన్ని చాటి చెప్పాయి. రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దిన‌ ప్రాంగణం మరింత సోభాయమానంగా కనిపించింది. కోటబొమ్మాళిలో ఇవాళ‌ జరిగిన సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. అందరినీ ఆనంద డోలికల్లో ఉర్రూతలూగించాయి. కోటబొమ్మాళిలో ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలను రాష్ట్ర వ్య‌వసాయ శాఖామంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కూట‌మి నాయ‌కులంతా క‌లిసి నిర్వ‌హించారు.

Kotabommali

ముందుగా వేద పండితులు గౌరీ శంకర శర్మ మంత్రోచ్ఛరణలో మంత్రి భోగి మంట వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేడుక‌ల్లో భాగంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. ఆనందోత్సాహాల న‌డుమ మన సంస్కృతిని ప్ర‌తిబింబిస్తూ ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. గతంలోని చెడును భోగి మంటల్లో దహిస్తూ ఉత్తరాయణంలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, రైతుకు మేలు చేకూరాల‌ని ప్రార్థిస్తూ సంక్రాంతి ల‌క్ష్మికి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. పాడిపంట‌ల‌కు నిల‌యంగా న‌వ్యాంధ్ర విల‌సిల్లాల‌ని, స‌క‌ల జ‌నుల హితం కోరి మంత్రి అచ్చెన్న సంక్రాంతి పండుగ సందేశం అందించారు.

Kotabommali

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… 2025 సంవత్సరం సూపర్ సిక్స్ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ చారిత్రక సంవత్సరంగా మిగిలిందన్నారు. 2026 సంవత్సరంలోనూ రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, తాగునీరు కల్పనతో పాటు ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పిస్తామన్నారు. ఈ ఏడాదిలో భూ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు పూర్వోదయం కేంద్ర ప్రభుత్వం పథకంతో రూ.4500 కోట్లు మంజూరైంద‌ని, దీంతో అన్ని ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. టెక్కలి నియోజకవర్గంలో తాగునీటికి రూ.600 కోట్లు మంజూర‌య్యాయ‌ని, ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని చెప్పారు.

భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ పనులు తమ ప్రభుత్వంలోనే పరుగులు పెడుతున్నాయని తెలిపారు. ఈ రెండింటికి మధ్య ఆరు లేన్ల‌ రహదారి నిర్మిస్తామని చెప్పారు. కోటబొమ్మాలిలో కొత్తగా ప్రారంభించే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించే కోర్సులు ప్రవేశపెట్టేటట్టు చర్యలు చేపడతానని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన రమేష్, పీఏసీఎస్ అధ్యక్షురాలు వి.విజయలక్ష్మి కామేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు, మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ, కర్రి అప్పారావు, అజయ్ కుమార్, నాగయ్య రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply