Peddapalli | రెండో రోజుకు చేరిన కోరుకంటి చంద‌ర్ పాద‌యాత్ర

పెద్దపల్లి రూరల్, మార్చి 18(ఆంధ్రప్రభ) : అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ సాగునీటి వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి రైతులను అరిగోస పెడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షులు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. గోదావరి గోసను ప్రజలకు వివరించేందుకు చేపట్టిన మహా పాదయాత్ర 2వ రోజు పెద్దపల్లి పట్టణం బందంపల్లి స్వరూప గార్డెన్ నుండి మంగళవారం కొనసాగించారు. పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యాత్రకు ఘన స్వాగతం పలికారు. పెద్దపల్లి బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

మహా పాదయాత్ర అన్నదాతల కష్టాలను, కన్నీళ్లను ప్రజలకు వివరించుకుంటూ ముందుకు సాగుతుందని చందర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎండిన గోదావరితో రైతన్నల కన్నీళ్లు, కష్టాలను చూసి చలించిన ఆనాటి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల కన్నీళ్లను తుడిస్తే అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై అక్కసుతో కాళేశ్వరం కూలిందని నెపం మోపి నీటిని దిగువకు వదిలి తెలంగాణను ఎండబెట్టిందని విమర్శించారు. కాళేశ్వరం అంటే ఏదో ఒక చిన్న ఆనకట్ట కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బరాజ్‌లు, 15 రిజర్వాయర్లు, 19సబ్‌ స్టేషన్లు, 21పంపు హౌస్లు, 200 కిలో మీటర్ల సొరంగాలు, 1530కిలో మీటర్ల గ్రావిటీ కెనాళ్లు, 98కిలో మీటర్ల ప్రెజర్‌ మెంట్స్, 141టీఎంసీల కెపాసిటీ ఉండి 530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం, 240టీఎంసీల ఉపయోగంతో కాళేశ్వరం ప్రాజెక్టును గొప్పగా నిర్మించారని అన్నారు. కాళేశ్వరం ఎండబెట్టడం వల్లే తెలంగాణలో రైతులు పంట పొలాలు ఎండుతున్నాయని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ పై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని, ప్రజల చేతిలో కాంగ్రెస్ ఓటమి ఖాయమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు, ఎడారిగా మారిన విధానాన్ని ప్రజలకు వివరించే విధంగా 180 కిలోమీటర్ల యాత్ర సాగుతుందన్నారు. గోదావరి నుండి ఎర్రబెల్లి వరకు ఈనెల 22వరకు కొనసాగే పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుండి యాత్ర కమాన్ మీదుగా కొనసాగింది. అడుగడుగునా పార్టీ శ్రేణులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో గంట రాములు, రఘువీర్ సింగ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుడు బొడ్డు రవీందర్, పెంట రాజేష్, దాసరి ఉష, లైసెట్టి భిక్షపతి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *