Komaram Bheem | పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం
Komaram Bheem | ఏటూర్ నాగారం, ఆంధ్రప్రభ : ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కొమరం భీమ్ జంక్షన్(Komaram Bheem Junction)లో ఈ రోజు ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రతిమకు ఘనంగా నివాళులు అర్పించారు.
తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు చందా మహేష్ మాట్లాడుతూ.. “పాతికేళ్ల వయస్సులోనే బిర్సా ముండా ఆంగ్లేయుల(English)పై పిడికిలి బిగించి ధైర్య–సాహసాలతో పోరాటం చేసిన గొప్ప వీరుడు అన్నారు. గిరిజనుల భూమి, నీరు, అటవీ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు నేటికీ ఆదర్శప్రాయాలు” అని పేర్కొన్నారు. ఆయనతో పాటు అనేక గిరిజన వీరుల గాథలను వెలుగులోకి తేవడం, వారి సేవలను స్మరించుకోవడం సమాజం ప్రతి తరానికి అవసరమని అన్నారు.
అలాగే శతాబ్దాలుగా ఆదివాసీలు న్యాయం, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటాల గురించి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా గిరిజన వీరులు స్వాతంత్ర్యం కోసం, సంప్రదాయాల పరిరక్షణ కోసం విశేషంగా పోరాడారని గుర్తుచేశారు. ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొటె రవి(Kote Ravi) మాట్లాడుతూ.. 1875 నవంబర్ 15న జన్మించిన బిర్సా ముండా(Birsa Munda) జర్మన్ మిషన్ స్కూలులో విద్యనభ్యసించి పాశ్చాత్య చరిత్ర ద్వారా బ్రిటిష్ పాలకుల అణచివేత గురించి అవగాహన పొందారని తెలిపారు.
1894లో ఆంగ్లేయుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించిన ఆయన, 1899లో సాయుధ పోరాటం చేపట్టి అనేక ఠాణాలు, భూస్వాముల ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేసి బ్రిటిష్ పాలకుల(British rulers)కు సింహస్వప్నమయ్యారని అన్నారు. 1900 జూన్ 9న జైలులో తుదిశ్వాస విడిచిన బిర్సా ముండా పేరు ఆదివాసీ సమాజాల్లో నేటికీ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అదే సమయంలో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, భూ హక్కుల విషయంలో ఆదివాసీలు నేటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బిర్సా ముండా గాథలు పాఠ్యాంశాల్లో భాగం కావాలని, ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం నిర్ణయాధికారాన్ని ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమరం లక్ష్మీకాంత(Komaram Lakshmi Kantha), ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు చేరుకుల ధర్మయ్య, ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు అన్నవరం వెంకటేశ్వర్లు, తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు పొడిశెట్టి అనసూయ, తుడుందెబ్బ నాయకులు మడప వెంకటేష్, చందా గణేష్,కోటేశ్వర రావు, మల్లెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

