Kolkata | పోలీసుల అదుపులో కొడాలి నాని..

కోల్‌కతా : మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోల్‌కతా(Kolkata) నుంచి కొలంబో(Kolombo) వెళ్తుండగా ఆయనను ఎయిర్‌పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ(Ap)లో నమోదైన కేసులో కొడాలి నానిపై లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. దీంతో కోల్‌కతా ఎయిర్ పోర్టులో కొడాలి నానిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కాగా కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో కొద్ది రోజులు హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్నారు. అనంతరం ముంబై ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో చేరారు. ఆ తర్వాత ఆయనకు గుండె సంబంధింత సర్జరీ చేశారు. ముంబైలో ఉన్నారని, త్వరలోనే రాష్ట్రానికి వస్తారని వైసీపీ నేతలు తెలిపారు. అయితే ఆయన కోల్‌కతా వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని రెచ్చిపోయి మాట్లాడేవారు. ప్రతిపక్ష నాయకులను దూషించేవారు. దీంతో అప్పట్లోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై పలువురు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొంతకాలంగా కొడాలి నాని రాష్ట్రంలో ఉండకపోవడంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా తాజాగా కోల్‌కతా ఎయిర్ పోర్టులో కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply