Kodad| ఉపాధ్యాయుడి ప్రాణం తీసిన సిగరెట్

కోదాడ మద్యం తాగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సిగరెట్‌ వెలిగించుకొని మంచంపై పడుకున్నారు.. మత్తులో దాన్ని ఆర్పివేయకుండా అలాగే నిద్రలోకి జారుకొన్నారు..

దీంతో మంచంపై మంటలు చెలరేగి ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని మంగళితండాలో ఆదివారం చోటుచేసుకుంది.

ఎస్సై అనిల్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధారావత్‌ బాలాజీ(52) నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ఎంపీపీఎస్‌ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం పండగ కావడంతో భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లారు.ఒంటరిగా ఉన్న బాలాజీ మద్యం తాగి ఇంటి వరండాలో సిగరెట్‌ తాగుతూ మంచంపై పడుకున్నారు.

అలాగే నిద్రలోకి జారుకోగా సిగరెట్‌ మంచం నవారుపై పడి మంటలు చెలరేగాయి. దీనికి కూలర్‌ గాలి తోడవడంతో భారీగా ఎగసిపడ్డాయి. చుట్టుపక్కన ఎవరూ లేకపోవడం, బాలాజీ మత్తులో ఉండటంతో శరీరానికి మంటలు అంటుకుని మృతిచెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *