KLU |రేటింగ్ కోసం లంచాలు – కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ వీసీ తో సహా 10 మంది అరెస్ట్

గుంటూరులో సీబీఐ అధికారులు మెరుపుదాడికి దిగారు. కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ లో విస్తత తనిఖీలు నిర్వహించారు. మెరుగైన నాక్ రేటింగ్ కోసం లక్షల రూపాయల మేర ముడుపులు ఇచ్చినట్టు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు.

అవి రుజువు కావడంతో కేఎల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ జీవీ సారథి వర్మను అరెస్ట్ చేశారు. లంచం తీసుకున్న కేసులో నాక్ టీమ్ సభ్యులు సైతం ఉండటం నివ్వెరపరుస్తోంది. గుంటూరుతో పాటు దేశవ్యాప్తంగా పలు ఉన్నత విద్యాసంస్థలపై ఏకకాలంలో ఈ దాడులు కొనసాగాయి.

దీనికోసం సీబీఐ అధికారులతో కూడిన 15కు పైగా టీమ్స్ రంగంలోకి దిగాయి.గుంటూరు వడ్డేశ్వరంలో ఉందీ కేఎల్ యూనివర్శిటీ. A++ NAAC అక్రిడిటేషన్ రేటింగ్ కోసం లంచం ఇచ్చారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడం, దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు తమ చేతికి చిక్కడంతో సీబీఐ అధికారులు ఈ మెరుపుదాడులకు దిగారు. నాక్ రేటింగ్ గుట్టురట్టు చేశారు.

నాక్ అధికారులకు లంచం ఇచ్చినట్లు రుజువు కావడంతో వైస్ ఛాన్సలర్ జీవీ సారథి వర్మతో పాటు మరో 10ని అరెస్ట్ చేశారు. మరో 14 మందిపై కేసు నమోదు చేశారు. యూనివర్శిటీకి అనుకూలంగా రేటింగ్ ఇవ్వాలంటూ ఏకంగా నాక్ టీమ్‌కు లంచం ఇచ్చినట్లు తమ దర్యాప్తులో తేలిందని సీబీఐ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

గుంటూరు, చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలాము, సంబాల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతమ్ బుద్ధ నగర్, న్యూఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ సందర్భంగా- అక్రిడిటేషన్ ప్రక్రియను ప్రభావితం చేయడానికి లంచంగా ఇచ్చిన నగదు, బంగారం, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

దాదాపుగా 37 లక్షల రూపాయల నగదు, ఆరు లెనోవా ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్ 16 ప్రో మొబైల్ ఫోన్, ఒక బంగారు నాణెం, అమెరికన్ టూరిస్టర్ ట్రాలీ బ్యాగ్‌ను వాళ్లు సీజ్ చేశారు.

అరెస్టయిన వారిలో గుంటూరు కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వైస్ ఛాన్సలర్ జీపీ సారధి వర్మ, కేఎల్‌యూ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, కేఎల్ యూనివర్సిటీ- హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఏ రామకృష్ణ, రామచంద్ర చంద్రవంశీ యూనివర్సిటీ ఛైర్మన్- నాక్ తనిఖీ టీమ్ సభ్యుడు సమరేంద్ర నాథ్ సాహా ఉన్నారు.

ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా, భారత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా డీన్ డాక్టర్ డీ గోపాల్, జాగరణ్ లేక్‌ సిటీ యూనివర్శిటీ డీన్ రాజేష్ సింగ్ పవార్, జీఎల్ బజాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ మానస్ కుమార్ మిశ్రా, దావణగెరె యూనివర్శిటీ ప్రొఫెసర్ గాయత్రీ దేవరాజ, సంబాల్‌పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ బులు మహారాణా అరెస్ట్ అయ్యారు. వీరందరూ కూడా నాక్ తనిఖీ టీమ్ సభ్యులు.

కేఎల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఆయనతో పాటు నాక్ ఉప మాజీ సలహాదారు డాక్టర్ ఎల్ మంజునాథరావు, బెంగళూరు యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ ప్రొఫెసర్, నాక్ ఐక్యూఏసీ డైరెక్టర్ ఎం హనుమంతప్ప, బెంగళూరు నాక్ సలహాదారు ఎంఎస్ శ్యామ్‌సుందర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *