విజయవాడ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు అమాయకులైన 26 మంది పర్యాటకులను చంపడం దుర్మార్గమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందు మన దేశం, మన రాష్ట్రం ఆ తర్వాతే మనమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ ఇవాళ జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, సామినేని ఉదయభాను, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, రావి సౌజన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు తామంతా అండగా ఉంటామని పవన్ కల్యాణ్ చెప్పారని అన్నారు. జనసేన ప్రతి నియోజకవర్గంలో చైతన్యం తెచ్చేలా కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఎంత బాధ ఉన్నా ఇలాంటి ఘటనల సమయంలో మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కావలిలో జనసేన నేత మధుసూదనరావు భౌతికకాయాన్ని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారని అన్నారు. జరిగిన దుర్ఘటన అతని భార్య చెబుతుంటే తమ కంట కన్నీరు ఆగలేదని చెప్పారు. అంత ఘోరంగా, అన్యాయంగా పర్యాటకులను చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో భారతీయ పౌరులంతా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అండగా ఉండాలని సూచించారు. జనసేన పక్షాన కొవ్వొత్తుల ర్యాలీ, నిన్న మౌన దీక్ష లయ, ఇవాళ మానవహారం నిర్వహించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
మన జెండా చూసి ఎంత గర్వ పడతామో.. అదే విధంగా మనం కలిసి ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బాధిత కుటుంబాలకు మనం అండగా ఉన్నామనే భరోసా ఇవ్వాలని చెప్పారు. ఉగ్రవాదుల దుశ్చర్యలకు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పి తీరుతుందని.. వారికి సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు, కుల, మతాలు చూడవద్దని అన్నారు. మనం భారతీయులుగా మన వాళ్లకు అండగా నిలుద్దామని చెప్పారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రజల్లో చైతన్యం తెస్తామని అన్నారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సాయం చేసేలా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. భద్రత విషయంలో ఎక్కడా రాజీపడకుండా ముందుకు వెళ్తామని చెప్పారు. నిఘా వర్గాలు ఇచ్చే సమాచారం ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.