AP | కియా ఇంజన్ల మాయం.. కస్టడీలో నిందితులు

శ్రీ సత్యసాయి బ్యూరో, ఏప్రిల్ 26 (ఆంధ్రప్రభ): ప్రసిద్ధి చెందిన కియా కార్ల కంపెనీలో మాయమైన కారు ఇంజన్ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని యర్రమంచి వద్ద గల కియా కార్ల ఫ్యాక్టరీలో 900 కారు ఇంజన్లు మాయమైన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి కియా యాజమాన్యం గత నెల 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రభ ప్రత్యేక కథనాలు ఇస్తూ వస్తోంది. ముఖ్యంగా కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేసును త్వరితగతిన ఛేదించి, నిందితులను గుర్తించి శిక్షించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఈ మేరకు సీఎంవో నుంచి స్థానిక జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ప్రత్యేకమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డీఎస్పీ, ఇరువురు సిఐలు, ముగ్గురు ఎస్సైలు, మరో ఆరు మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేకంగా సిట్ ను సైతం నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు వెళ్లి సుమారు 8మందిని అదుపులోకి తీసుకొని, ఈనెల రెండవ తేదీన పెనుకొండ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఆరుగురు నిందితులను పోలీసులు తమ కస్టడీకి తీసుకొని, విచారించగా సుమారు 288కారు ఇంజన్లు ఢిల్లీలో అమ్మినట్లు తెలుసుకొని, నిందితులతో పాటు సిట్ బృందం ఢిల్లీ వెళ్ళినట్లు సమాచారం. దీనికి ముందు వారు తమిళనాడులో సైతం పలు ప్రాంతాల్లో విచారణ సాగించారని తెలుస్తోంది. దీంతో త్వరలోనే కియా కార్ల ఇంజన్ల మాయం కేసుకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు పోలీసులు పత్రికల ముందుకు వచ్చేందుకు అవకాశం ఉన్నట్లు భావించవచ్చు.

Leave a Reply