హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana)రాష్ట్రంలో వినాయక చవితి (Vinayaka Chavithi) వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా గణపతి మండపాల వద్ద పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు అన్నదానాలు చేపడుతున్నారు. నగరంలోని ఖైరతాబాద్ గణేషుడి (Khairatabad Ganesha) దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బుధవారం వరకు 12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గురువారం అర్ధరాత్రి వరకు ఖైరతాబాద్ గణనాథుడి దర్శించుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఖైరతాబాద్ వినాయకుడి దర్శనాన్ని నిలిపివేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం భారీగా భక్తులు వచ్చే అవకాశముంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా భారీగా పోలీసులు మొహరించారు.
శనివారం నిమజ్జనోత్సవం
ఈనెల 6న హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తెలంగాణ ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించింది. శనివారం ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరగనుంది. గణేశ్ నిమజ్జనాలకు GHMC కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నగరంలో 50 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జానికి సిద్ధమయ్యాయి.