Kerala | లాటరీ గుట్టురట్టు..

Kerala | లాటరీ గుట్టురట్టు..

Kerala, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు పట్టణంలో అక్రమంగా కేరళ లాటరీ టికెట్లను విక్రయిస్తూ ప్రజలను మోసగిస్తున్న నలుగురు వ్యక్తులను చిత్తూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.25,200 నగదు సహా లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారి పై చట్టప్రకారంగా కఠిన చర్యలు తప్పవని చిత్తూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి. నెట్టి కంటయ్య స్పష్టం చేశారు. జిల్లాలో అక్రమ విక్రయాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్న జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చిత్తూరు ఉప విభాగ పోలీసు అధికారి టి. సాయినాథ్ పర్యవేక్షణలో, చిత్తూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి. నెట్టికంటయ్య, సహాయ ఉప పరిశీలకుడు తులసీ రామ్, ప్రధాన కానిస్టేబుల్ బాబు తదితర సిబ్బంది సంయుక్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించారు.

బుధవారం రాత్రి సుమారు 10 గంటల 15 నిమిషాల సమయంలో చిత్తూరు పట్టణంలోని జానకారపల్లి జంక్షన్ వద్ద లాటరీ టికెట్లను అక్రమంగా విక్రయిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బి. నంద కుమార్, సెంథిల్ కుమారన్, ఎస్. అంసార్, ఎన్. లతీఫ్ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.25,200 నగదు, లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధితమైన లాటరీ టికెట్లను చిత్తూరు పరిసర ప్రాంతాల్లో అవసరమైన వారికి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై చిత్తూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఆంధ్రప్రదేశ్ లాటరీల నిషేధ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

ముద్దాయిల వివరాలు..
మొదటి ముద్దాయి బి. నంద కుమార్ (52), తండ్రి భీమన్, రాంనగర్ కాలనీ, చిత్తూరు పట్టణం.
రెండో ముద్దాయి సెంథిల్ కుమారన్ (52), తండ్రి ధండపాణి మొదలియార్, నిమంధకార వీధి, చిత్తూరు పట్టణం.
మూడో ముద్దాయి ఎస్. అంసార్ (50), తండ్రి జలాల్, లెనిన్ నగర్, మంగసముద్రం, చిత్తూరు పట్టణం.
నాలుగో ముద్దాయి ఎన్. లతీఫ్ (28), తండ్రి నరసింహులు, నాగలమ్మ వీధి, మురకంబట్టు.

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, లాటరీ టికెట్ల కొనుగోలుతో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని, తమ కష్టార్జితమైన డబ్బును నష్టపోకుండా చూసుకోవాలని సూచించారు. అక్రమ లాటరీ విక్రయాల పై సమాచారం అందిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Leave a Reply