KCR Municipal Elections | మునిసిపల్ ఎన్నికల వేళ బీఆరెస్‌లో వ్యూహాత్మక మార్పులు

KCR Municipal Elections | కేసీఆర్ ప్రత్యక్ష ప్రచారం చేసే అవకాశాలపై రాజకీయ వర్గాల అంచనా
కేటీఆర్ నాయకత్వానికి ఇది కీలక పరీక్ష
బీఆరెస్ భవిష్యత్ దిశను నిర్ణయించే మునిసిపల్ ఎన్నికలు
తండ్రి అనుభవం + కుమారుడి కొత్త ఆలోచనలు
స్థానిక ఎన్నికలు – పార్టీకి కొత్త ఉత్సాహమా?
KCR Municipal Elections | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మునిసిపల్ ఎన్నికల్లో ప్రత్యక్ష ప్రచారమా? తనయుడికి దిశా నిర్దేశానికే పరిమితమా? మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం మరింత వేడ్క్కింది. సమరానికి సై అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు కాలుదువ్వుతున్నాయి…ఎత్తులకు పై ఎత్తులు…వ్యూహ ప్రతివ్యూహ రచనలకు సన్నద్ధమయ్యాయి. స్థానిక ఎన్నికల్లో సాధారణంగా గెలుపు అధికార పార్టీలదే అనేది తెలిసినదే అయినా, ఒక్కోసారి అధికార పార్టీల ఓవర్ కాన్ ఫిడెన్స్ వల్ల ఫలితాలు తలకిందులయ్యే అవకాశాలూ వస్తాయి.
అందుకని, వైరి పక్షాలు ఎదుటి వారిని తక్కువ అంచనా వేయకుండా, తమ శక్తివంచన లేకుండా పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మరో కీలకమైన ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీఆరెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతారా? లేక ఆయన తనయుడు,బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు మార్గదర్శకుడిగా మాత్రమే వ్యవహరిస్తారా?

అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తే, కేసీఆర్ విస్తృత స్థాయిలో ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొనే అవకాశం చాలా తక్కువనే రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ ఆనారోగ్య పరిస్థితితో విశ్రాంతి తీసుకోవడం, రాజకీయ వ్యూహంలో మార్పులు చోటు చేసుకోవడం, కేటీఆర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించి కొత్త నాయకత్వాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం జరిగింది. అలాగని కేసీఆర్ పూర్తిగా క్రియాశీలత నుండి పక్కకు తప్పుకోలేదు. అదే క్రమంలో ముఖ్యమైన కీలక మునిసిపాలిటీలు, బలమైన పట్టణ కేంద్రాల్లో మాత్రమే కేసీఆర్ సభలకు హాజరవడం, బహిరంగ సందేశాలు ఇవ్వవచ్చని ఒక అంచనా.
ముఖ్యంగా కేసీఆర్ ప్రధానంగా పార్టీకి పెద్దదిక్కుగా “స్ట్రాటజిక్ గైడ్” పాత్రలో ఉండే అవకాశం ఎక్కువ ఉందని పార్టీ శ్రేణులు, రాజకీయ వర్గాల అభిప్రాయం. అభ్యర్థుల ఎంపికలో తుది నిర్ణయం, పార్టీకి దిశానిర్దేశం చేయడం, ప్రధానమైన నినాదాలు, ప్రచార స్వరంలో మార్గదర్శకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడి చేసే కీలక రాజకీయ అంశాలు ప్రచారంలో పొందుపరచడం తదితర విషయాలలో కేసీఆర్ అనుభవం, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు కేటీఆర్‌కు మార్గదర్శకంగా నిలువనున్నాయి.
కేటీఆర్ తండ్రి వ్యూహాలను అనుసరిస్తారా, లేక తన సొంత ఆలోచనలతో ముందుకెళ్తారా అనేది అత్యంత కీలకమైన ప్రశ్న. అయితే కేటీఆర్ పూర్తిగా కేసీఆర్ వ్యూహాలను మాత్రమే అనుసరించే అవకాశాలు తక్కువనే చెప్పవచ్చు. కానీ, తండ్రి అనుభవాన్ని విస్మరించి పక్కకు పెట్టేయడం జరగదు. తండ్రి రాజకీయ తత్వానికి తన ఆధునిక ఆలోచనలను జోడించి ముందుకెళ్ళొచ్చు. అందుకే ఈ మునిసిపల్ ఎన్నికలు కేటీఆర్‌కు స్వంత రాజకీయ ముద్ర వేయడానికి వచ్చిన మరొక అవకాశంగా భావించవచ్చు.

ఇది కేవలం ఎన్నికల వ్యూహం మాత్రమే కాదు, బీఆరెస్ భవిష్యత్ నాయకత్వ మార్పుకు సంకేతంగా కూడా చూడవచ్చు. కేటీఆర్ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే, అది కేవలం మునిసిపల్ గెలుపు కాదు బీఆరెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వెల్లి విరిసి, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఉరకలేయిస్తుంది.
click here to read 2026 | తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు: కేటీఆర్‌కు కీలక పరీక్ష, కవిత పాత్రపై ఆసక్తి
