Karnool ప్రగతి పద్దులకు పచ్చజెండా
కర్నూలు బ్యూరో : కర్నూలు నగరపాలక సంస్థ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పాలకవర్గం గురువారం ఆమోదించింది. రూ.291.67 కోట్లతో అధికారులు ప్రతిపాదిత బడ్జెట్ ప్రవేశపెట్టగా, కార్పొరేటర్లు పలు సందేహాలను వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక కౌన్సిల్ హాలులో మేయర్ బి.వై. రామయ్య అధ్యక్షతన బడ్జెట్, సాధారణ సమావేశం నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
అనంతరం బడ్జెట్‌లోని అంశాలను అధికారులు చదివి వినిపించారు. మొత్తం ఆదాయం రూ.363.99 కోట్లు, ఖర్చు రూ.162.77 కోట్లు, రెవెన్యూ ఆదాయం రూ.201.22 కోట్లు, ప్రభుత్వ గ్రాంట్లు రూ.162.77 కోట్లు, మూలధన రాబడి రూ.138.69 కోట్లు, నికర మిగులు రూ.72.31 కోట్లుగా అంచన వ్యయం చూపించారు. అనంతరం సాధారణ సమావేశం నిర్వహించి, 17 అంశాలపై చర్చించి, ఆమోదం తెలిపారు. రూ.6.79 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల కేటాయింపునకు పచ్చ జెండా ఊపారు.ఇక కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలకు కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సమాధానం ఇచ్చారు. కూడళ్ళలో బ్యానర్లు నిషేధిస్తామని, ఏర్పాటు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. మహనీయులను అందరూ గౌరవించాలని, వారి విగ్రహాలు కనబడకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు.
పైగా దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం సైతం ఉందన్నారు. పార్కు స్థలాల ఆక్రమణలను కట్టడి చేస్తామని, పార్కుల వద్ద ఎంట్రీ రుసుమును ప్రైవేటు వ్యక్తులు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పార్కు స్థలాల వద్ద ప్రహరీ గోడలు, బోర్డుల ఏర్పాటు చేస్తామన్నారు. వారంలోపు భారత జంతు సంక్షేమ మండలి నుండి ప్రాజెక్ట్ రికగ్నేషన్ సర్టిఫికెట్ (లైసెన్స్) వస్తుందని, వచ్చిన వెంటనే కుక్కలకు కుటుంబ సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలను ప్రారంభిస్తామన్నారు.
చెత్త వాహనాలు మరమ్మతులు వేగవంతం చేస్తామన్నారు. రహదారులపై దుకాణం ఏర్పాటు చేసి, అద్దెలకు ఇస్తే సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దుకాణదారులు ఎవరికి అద్దె చెల్లించవద్దని సూచించారు. పారిశుద్ధ్య పనులు మరింత మెరుగుపరిచేందుకు మరో రెండు డోల్జర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
*ఆమోదించిన తీర్మానాలు..
*1. 15వ ఆర్థిక సంఘం 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2వ విడత నిధులు రూ.15,60,12,349 ల వినియోగానికి సంబంధించి జరిగిన పనులను ధృవీకరించారు.2. 15వ ఆర్థిక సంఘం 2023-2024వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.16,23,57,967 లతో 15 రకాల అభివృద్ధి పనులకు చేపట్టుటకు, రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపుటకు ఆమోదం తెలిపారు.3. 6వ వార్డు గరీబ్ నగర్, బడివీధి ప్రాంతాల్లో రూ.35 లక్షలతో రహదారులు, మురుగు కాలువలు నిర్మించుటకు ఆమోదం తెలిపారు.4. 35వ వార్డు ఉమా మహేశ్వర నగర్ రూ.42 లక్షలతో రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపారు.5. 37వ వార్డు శాంతి నగర్ నందు అధ్వానంగా ఉన్న రహదారులు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టుటకు రూ.50 లక్షల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.6. 34వ వార్డు నిర్మల్ నగర్ నందు ఈఎల్‌యస్‌ఆర్ ట్యాంకు చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుటకు రూ.27 లక్షలు మంజూరు చేశారు.7. 39వ వార్డు బంజార కాలనీలో రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయుటకు ఆమోదించారు.8. చెక్‌పోస్ట్ సమీపంలో జోహారపురం రోడ్డున పెట్రోల్ పంపు ఏర్పాటుకు (జిల్లా కలెక్టర్ ద్వారా అందిన నకలు) నిర్వాహకులు వై.నర్సిరెడ్డికు నిరభ్యంతర పత్రం జారీ చేయుటకు ఆమోదించారు.
9. 3వ వార్డు సాగ్ మండి, మొఘల్ పుర, బండిమెట్ట ప్రాంతాల్లో రహదారుల సమస్య, మురుగు కాలువల నిర్మాణానికి రూ.40.00 మంజూరు చేశారు.10. 16వ వార్డు బుధవారపేట నందు మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.18.50 లక్షలు కేటాయించారు.11. 19వ వార్డు నాజర్ కాలనీ, మల్లికార్జున నగర్ నందు రూ.33 లక్షలతో డిస్పోసల్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.33 లక్షలు మంజూరు చేశారు.12. 20వ వార్డు బద్రినాథ్ నగర్, ధనలక్ష్మి నగర్ నందు మురుగు కాలువల సమస్య పరిష్కారానికి రూ.53.25 లక్షలు కేటాయింపు.13. 21వ వార్డు గురుకుల పాఠశాల నుండి ప్రధాన రహదారి వరకు రూ.24.50 లక్షలతో అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి ఆమోదించారు.14. 46వ వార్డులో నరసింహా రెడ్డి నగర్ నుండి శ్రీ కిచెన్స్ వరకు మురుగు కాలువల నిర్మాణానికి రూ.40.20 లక్షలు కేటాయించారు.
15. నగరపాలక నందు పనిచేస్తున్న 200 తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుల సేవలను జులై 31 నాటి వరకు పొడిగిస్తూ, ఒక్కొక్కరి రూ.15,000/- చొప్పున చెల్లించుటకు అగు రూ.1.71 కోట్లను మంజూరు చేశారు.16. గత ఏడాది ఏప్రిల్ 1 నాటికి పనులు దక్కించుకుని, ప్రారంభించని 160 పనులు, 25% శాతంలోపు చేసిన 3 పనులను రద్దు చేశారు.17. కర్నూలు నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి, ఆదాయం పెంపు, తదితర సాంకేతిక పనులను చేపట్టుటకు తక్కువగా కోట్ చేసిన శ్రీవాస్త కన్సల్టెన్సీ ఏజెన్సీకు రూ.94.40 లక్షలతో పనులు అప్పగించేందుకు అనుమతి ఇచ్చారు.