కపాస్ కిసాన్ డిజిటల్ కొనుగోళ్లు ప్రారంభం
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : మార్కెట్ లోపత్తి రైతులకు జరిగే మోసాలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన “కపాస్ కిసాన్” డిజిటల్ కొనుగోళ్లు ఆదిలాబాదులో లాంచనంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తెచ్చిన పత్తి సరకును ఆన్లైన్ మొబైల్ యాప్ ద్వారా శ్రీకారం చుట్టి ప్రయోగత్మకంగా కొనుగోళ్లను ప్రారంభించారు. ప్రతి ఏటా వ్యాపారులు, మధ్య దళారుల చేతిలో పత్తి రైతులు మోసపోతున్న నేపథ్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “కపాస్ కిసాన్” యాప్ ను తెర పైకి తెచ్చింది.
ఇక తాక్ పట్టి, రసీదులకు చెక్ పెడుతూ రైతుల మొబైల్ ఫోన్లోనే ఓటిపి ద్వారా స్లాట్ బుకింగ్ పత్తి కొనుగోలు చేపట్టేలా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు గావించింది. రైతులకు సంబంధించి 24 అంశాలను పొందుపరిచే విధంగా మొబైల్ ఫోన్లోనే ప్రత్యేక యాప్ ను పొందుపరిచారు. వ్యవసాయ అధికారులు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు ఈనెల 27 నుండి ప్రారంభమవుతాయని, ప్రయోగాత్మకంగా రైతుల అవగాహన కోసమే ఈరోజు స్మార్ట్ డిజిటల్ పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టినట్టు కలెక్టర్ తెలిపారు. రైతులంతా కపాస్ కిసాన్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్వింటాలు మద్దతు ధర రూ. రూ 8,110../
కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలు కనీస మద్దతు ధర రూ. 8,110 నిర్ణయించినందున రైతులు ప్రైవేటు దళారులను ఆశ్రయించకుండా భారత్ కాటన్ కార్పొరేషన్ ( సీసీఐ) ఏర్పాటు చేసిన సెంటర్లలో కొనుగోలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈనెల 27 నుండి పూర్తి స్థాయిలో పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయని, నాణ్యమైన పత్తిని మాత్రమే మార్కెట్లోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా సీసీఐ అధికారులు మాట్లాడుతూ… 8 నుండి 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని, పత్తిని ఆరబెట్టి నాణ్యతతో కూడిన దూదిని తీసుకురావాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ లో 10.62 లక్షల ఎకరాల్లో పత్తి సాగు..
వర్షాధారం పైనే నమ్ముకుని పత్తి పంట సాగు చేస్తున్న రైతులకు ఈసారి అధిక వర్షాలు దిగుబడి పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. గత ఏడాది సగటున 9 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి రాగా, పూతకాతదశలో పంట దెబ్బతిని, తెగుళ్లు సోకి సగటున 5 నుండి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 10.62 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా, ఈసారి పత్తి మార్కెట్ వ్యాపారం భారీగానే తగ్గుముఖం పడుతుందని మార్కెటింగ్ అధికారులు పేర్కొన్నారు. కాగా ప్రైవేట్ మార్కెట్లో వ్యాపారులు రూ. 6,200 ధర మాత్రమే చెల్లిస్తూ రైతులను దగా చేస్తున్నారు. తూకం, కోతల పేరిట వ్యాపారులు ఆగడాలకు చెక్ పెట్టి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోలు ప్రారంభించాలని రైతులు అధికారులను కోరారు. ప్రయోగాత్మక స్లాట్ బుకింగ్ పత్తి కొనుగోళ్ల కార్యక్రమంలో కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్, మార్కెటింగ్ సెక్రటరీ శ్రీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామి, సీసీఐ అధికారులు పునీత్ రాటి, ఏ శరత్, ఏ ఎస్ పి సురేందర్రావు, డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

