- ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయం గెలిచింది
- మళ్లీ రైతులకు సేవ చేసే భాగ్యం కలిగింది
- సొసైటీ చైర్మన్ కపిల్ రెడ్డి
తాడ్వాయి (ఆంధ్ర ప్రభ): హైకోర్టు ఆదేశాల మేరకు తాడ్వాయి సొసైటీ చైర్మన్‌గా నల్లవెల్లి కపిల్ రెడ్డి మళ్లీ బాధ్యతలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే… సొసైటీ చైర్మన్‌ల పదవీకాలం ముగియడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలలపాటు పదవిని పొడిగించిన విషయం తెలిసిందే. దాంతో నియోజకవర్గంలోని అన్ని సొసైటీలలో చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు. అయితే తాడ్వాయి సొసైటీని మాత్రం ఖాళీగా ఉంచడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన కపిల్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
విచారణ అనంతరం… యథావిధిగా చైర్మన్ బాధ్యతలు అప్పగించాలి అని హైకోర్టు ఆదేశించడంతో, ఆయన గురువారం కార్యాలయంలో తిరిగి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కపిల్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘మాకు నిరంతరం అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా పదవి రాకుండా చేయడానికి అధికార పార్టీ ఎన్నో కుట్రలు పన్నింది. కానీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా… చివరికి న్యాయమే గెలుస్తుందని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. ఇది అధికార పార్టీకే ఒక చెంప పెట్టు. రైతులకు మళ్లీ సేవ చేసే అవకాశం రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ముధం నర్సింలు, వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, రాజిరెడ్డి, సొసైటీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

