కామారెడ్డి జిల్లా : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రాజెక్టు వరద గేట్ల పక్కనే గండి ఏర్పడటంతో భారీగా వ‌ర‌ద‌ నీరు బయటకు వెళ్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు నుండి సుమారు 1.15 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, 1.47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది.

రాత్రి వరకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పోచారం డ్యాం కట్ట తెగిపోతుందేమోనన్న భయం స్థానిక ప్రజల్లో అలజడి రేపుతోంది.

డేంజర్‌లో 10 గ్రామాలు

డ్యాం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పరిస గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా పోచారం, మూల్తుమ్, గోలిలింగాలు, ఎంకంపల్లి, తాండూరు, పోచమ్మరాళ్, గాంధారిపల్లి, కుర్తివాడ, ఆరెపల్లి గ్రామాలు అత్యంత ప్రమాదంలో ఉన్నట్లుగా అధికారులు హెచ్చరించారు.

అధికారులు అప్రమత్తం

వరద ఉధృతి పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇదిలా ఉండగా, అధికారులు ప్రాజెక్టు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలను రంగంలోకి దింపేందుకు సిద్ధంగా ఉందని జిల్లా యంత్రాంగం వెల్లడించింది.

రాకపోకలకు ఆటంకం

జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద ప్రభావం కారణంగా హైదరాబాద్–బోధన్ జాతీయ రహదారి వద్ద రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.

Leave a Reply