పుణ్యస్నానాల కోసం పోటెత్తుతున్న భక్త జనం
కాళేశ్వరం నుంచి 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మరో వైపు గాలి వానతో చిత్తడిగా మారిన రోడ్లు
రంగంలోకి దిగిన కలెక్టర్, ఎస్పీ
ట్రాఫిక్ ను నియంత్రలో పోలీసులు
ఘాట్ వద్ద పర్యవేక్షణ చేస్తున్న కలెక్టర్
వాహనాలకు టోల్ టాక్స్ రద్దు
త్రివేణి సంగమంలో మంత్రి తుమ్మల పుణ్య స్నానం
భూపాలపల్లి- ఆంధ్రప్రభ ప్రతినిధి – కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. సరస్వతి ఒడిలో పుష్కర స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వీఐపీ ఘాట్ వద్ద త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించి సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటున్నారు.
అకాల వర్షంతో ….
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం లో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. వీఐపీ ఘాట్‌లో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, టెంట్లు కూలిపోయాయి. పలుచోట్ల ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు గాలికి కొట్టుకుపోయాయి. భారీ వర్షం కురిడంతో కాళేశ్వరం మొత్తం బురదమయమైంది. దీంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రంగంలోకి దిగిన కలెక్టర్ , ఎస్పీ
ఈ నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,ఎస్పీ కిరణ్ స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి నుండి ఇద్దరూ జిల్లా బాస్ లు సరస్వతి ఘాట్, టెంట్ సిటీ, స్టాల్స్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. వర్షం కారణంగా విద్యుత్తులో తాత్కాలిక అంతరాయం ఏర్పడిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టి మళ్లీ విద్యుత్ సరఫరా కొనసాగించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అవసరమైన సహాయ చర్యలు అందిస్తున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత సిబ్బందికి సూచనలు, మార్గదర్శకాలు అందజేస్తున్నారు.
కాళేశ్వరంలో ట్రాఫిక్ జామ్ … బైక్ పై కలెక్టర్, ఎస్పీ

సరస్వతి పుష్కరాలు పురస్కరించుకొని ఉదయం నుండే ఆర్టిసి, ప్రైవేట్ వాహనాల్లో భారీగా భక్తులు తరలి రావడంతో ప్రధాన కూడలిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం నుంచి మహదేవ్‌పూర్ మధ్యలో 10 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 3 గంటలుగా వాహనాలు స్తంభించిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే రంగంలోకి దిగి ద్విచక్ర వాహనంపై పర్యటిస్తూ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.
వాహనాలకు టోల్ రద్దు

సరస్వతి పుష్కరాలు సందర్భంగా కాళుశ్వరం విచ్చేసే భక్తుల వాహనాలకు టోల్గేట్ రద్దు చేసినట్లు శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. వాహనాల నుంచి ఎలాంటి టోల్ గేట్ వసూలు చేయొద్దని ఆయన ఆదేశించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు కాళేశ్వరంలో టోల్ గేట్ చెల్లించొద్దని సూచించారు. వాహనాలు రద్దీ నియంత్రణకు టోల్ గేట్ రద్దు చేసినట్లు ఆయన వివరించారు.
పుష్కరస్నానం ఆచరించిన మంత్రి తుమ్మల
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు. జ్ఞాన సరస్వతి ఘాట్ లో పుష్కర స్నానాలు ఆచరించి సరస్వతి మాతకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీ శుభానంద దేవి సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, సాయంత్రం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి గోదావరి హారతి కార్యక్రమానికి హాజరుకానున్నారు.