ఘనంగా కళావేదిక కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం..

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును సాంకేతికంగా బలోపేతం చేసే దిశగా జెడ్పీహెచ్ఎస్ గురుజాలలో నిర్మించిన కళావేదిక, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ సభ స్ఫూర్తిదాయకంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఆశలు నింపింది. ముఖ్య అతిథిగా హాజరైన బెస్ట్ రన్నర్స్ ఆర్గనైజేషన్ అమెరికా ఇండియా సమన్వయకర్త ముక్క శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా సాంకేతిక వనరులు అవసరమని అన్నారు.

40 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో ప్రారంభమైన తమ సంస్థ టీవీ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, కళావేదికలు, డెస్కులు, సైకిళ్లు అందించి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. గురుజాల పాఠశాలలో మూడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కళావేదిక, కంప్యూటర్ ల్యాబ్ విద్యార్థుల ప్రతిభను వికసింపజేసే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్ననాటి నుంచే పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి, చదువుకున్న పాఠశాలను మరువకుండా తిరిగి అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అలా జరిగినప్పుడే తమ సంస్థ సేవలకు నిజమైన అర్థం ఉంటుందని తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు.

అనంతరం కళావేదిక, కంప్యూటర్ ల్యాబ్, సౌండ్ సిస్టంను ముక్క శ్రీనివాస్, గర్రెపల్లి వీరేశలింగం, ముక్క రమేష్‌లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అందంగా నిర్మించిన కళావేదికను చూసి అతిథులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పిరమిడ్ విన్యాసాలు అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నాయి. గ్రామ సర్పంచ్ బండారి చంద్రరావు మాట్లాడుతూ, గురుజాల ప్రభుత్వ పాఠశాలకు అత్యాధునిక సదుపాయాలు అందించిన బెస్ట్ రన్నర్స్ సంస్థకు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన, సాంకేతిక విద్య అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషి, దాతల సహకారంతో పాఠశాలను ఆదర్శ విద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే శిల్పులని, వారి కృషి వల్లే పిల్లల భవిష్యత్తు బంగారు మార్గంలో నడుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ముఖంబికా ట్రస్ట్ ఆధ్వర్యంలో అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రభు కుమార్ అందించిన ఎగ్జామ్ ప్యాడ్‌లను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం దాతలు ముక్క శ్రీనివాస్, ముక్క రమేష్, గర్రెపల్లి వీరేశలింగంలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల కలలకు రెక్కలు తొడిగేలా… గ్రామీణ పాఠశాలలకు సాంకేతిక వనరులు అందితే, ప్రభుత్వ పాఠశాలల నుంచే రేపటి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, నాయకులు తయారవుతారని ఈ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది.

Leave a Reply