ఎన్నాళ్లీ నిరీక్షణ ?

  • శిథిలావస్థలో కాళంగి గ్రాయిన్‌

సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పులికాట్‌ గుర్తింపు పొంది ఉంది. ఈ పులికాట్‌ సరస్సు ముఖద్వారంలో కాళంగినది ఉంది. ఈ కాళంగి నది ద్వారా రైతులకు సాగునీరు. ప్రజలకు తాగునీరు పుష్కలంగా అందుతుంది.. నదిలో నీటి ప్రవాహం లేని సమయంలో పులికాట్‌ సరస్సులోని ఉప్పునీరు కాళంగి నదిలోకి చేరకుండా ఉండేందుకు 1992లో అప్పటి మంత్రి పసల పెంచలయ్య హాయాంలో కాళంగి గ్రాయిన్‌ ఏర్పాటుకు పునాది పడింది.

ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుని అధ్వాన్నంగా మారి ఉంది. దీంతో ఉప్పునీరు కలుస్తుండడంతో కాళంగి నది నీరు మొత్తం ఉప్పుగా మారి పంటలకు, ప్రజలు తాగడాకి వీలుకాని పరిస్థితి నెలకొంది.. బావులు, బోర్లలోని నీరు సైతం ఉప్పుగా మారడంతో ప్రజలు, రైతులు లబోదిబోమంటు-న్నారు.. ప్రభుత్వాలు మారుతున్నా ఏన్నో ఏళ్లుగా ఉన్న ఈ సమస్య మాత్రం పరిష్కారం కాకపోతుండడంతో రైతులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.. పలుమార్లు రైతులు, ప్రజలు ఈ గ్రాయిన్‌ను అభివృద్ధి చేయాలని ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో గ్రాయిన్‌ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.. కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ హయాంలోనైనా కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి జరుగుతుందా అని రైతులు, ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి శిధిలావస్థలో ఉన్న కాళంగి గ్రాయిన్‌ను అభివృద్ధి చేసి పున:నిర్మించాలని ప్రజలు, రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ) : సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండలాల గుండా ప్రవహించే కాళంగి నది తడ మండల సమీపంలోని పులికాట్‌ సరస్సు వద్ద సముద్రంలో కలుస్తుంది. కాళంగినది నీటిని ఆధారంగా చేసుకుని పరివాహక ప్రాంతాల్లో రైతులు సుమారు 15 వేల ఎకరాలకు పైగా వరి పంట సాగు చేస్తున్నారు.

అలాగే సూళ్లూరుపేట పట్టణంతో పాటు వాటంబేడు నుంచి మన్నారుపోలూరు, చెల్లెమ్మ బొంద దాకా ఉన్న బావులు, బోర్లను ఆధారంగా చేసుకుని రైతులు పంటలు పండించుకుంటున్నారు. అదేవిధంగా సూళ్లూరుపేట పట్టణంలో సుమారు లక్ష, పల్లెల్లో మరో 10 వేలు, షార్‌ కాలనీల్లో సుమారు 7 వేల మందికి పైగా బోర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు.

ప్రస్తుతం బోర్లు, బావుల్లోని నీరు సైతం ఉప్పు నీరుగా మారడంతో ప్రజలు తాగేందుకు సరిపడ తాగునీరు దొరక్క ప్రతిరోజూ నగదు వెచ్చించి తాగునీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి చేసేలా అప్పటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రత్యేక దృష్టి సారించి ఇరిగేషన్‌ శాఖ మంత్రితో కలిసి కాళంగి గ్రాయిన్‌ను పరిశీలించి దీనిని అభివృద్ధి చేసేలా ఈ విషయాన్ని అప్పటి సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించారు.

అయితే ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడం, వరదలు సంభవించడం, ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి విషయమై ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యే డాక్టర్‌ నెలవల విజయశ్రీ ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.

1992లో కాళంగి గ్రాయిన్‌ నిర్మాణానికి పునాది

కాళంగినదిలో పులికాట్‌ సరస్సు ఉప్పునీరు కలుస్తుందని గుర్తించిన అప్పటి మంత్రి పసల పెంచలయ్య 1992లో ప్రపంచ బ్యాంకు నిధులతో తడ మండల పరిధిలోని వాటంబేడు సమీపంలో ఉన్న పులికాట్‌ సరస్సులో కాళంగి నది కలిసే ప్రాంతంలో గ్రాయిన్‌ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో దీనికి మంజూరైన నిధులు చాలకపోవడంతో బొంతరాళ్లతో గ్రాయిన్‌ నిర్మించి వదిలేశారు.

తరువాత ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. 2001లో తుపాను దాటికి కాళంగి గ్రాయిన్‌ తెగిపోవడంతో ఉప్పునీరు పైకి ఎగబాకింది. దీనిని గుర్తించిన వాటంబేడు, చేనిగుంట, గ్రద్దగుంట రైతులు అందురూ కలిసి ఇసుక బస్తాలు వేసి అప్పట్లో తాత్కాలికంగా కొంతమేర నష్టాన్ని తగ్గించుకున్నారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గ్రాయిన్‌ అభివృద్ధి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు.

వైసీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు..

2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో రూ.35 లక్షలతో కాళంగి గ్రాయిన్‌ పనులు తూతూ మంత్రంగా చేపట్టింది. చేసిన ఈ పనులు మూన్నాళ్ల ముచ్చటగానే కొద్ది కాలంలోనే గ్రాయిన్‌ కొట్టుకుపోయింది. తరువాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌లు శిధిలావస్థలో ఉన్న కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సానుకూలంగా స్పందిచి రైతులు, ప్రజల సౌకర్యార్ధంగా కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి చేసేందుకు తొలుత రూ 8.3 కోట్లు మంజూరు చేశారు. తర్వాత అంచనాలను సవరించి రూ11 కోట్లు కేటాయించారు. ఏన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఇక తెరపడుతుందని భావించిన రైతుల ఆశలు నిర్వీర్యం అయ్యాయి. కాంట్రాక్టర్‌ సకాలంలో పనులు చేపట్టక పోవడం, అంతలోనే వరదలు రావడం, ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పనులు ముందుకు సాగలేదు.

తరువాత జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో పోటీ చేసిన నెలవల విజయశ్రీ విజయం సాధించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో ఏళ్లుగా శిథిలావస్ధకు చేరుకుని ఉన్న కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధిపై దృష్టిసారిచాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల నాయుడుపేట పర్యటనకు వచ్చిన ఇరిగేషన్‌ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి కాళంగి గ్రాయిన్‌ అభివృద్ధి విషయమై చర్చించి ఉన్న నేపధ్యంలో నిధులు మంజూరు చేయించి కాళంగి గ్రాయిన్‌ను అభివృద్ధి చేసేలా పూర్తి స్ధాయిలో దృష్టి సారిస్తే ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి మంచి గుర్తింపు రావడంతో పాటు రైతులు, ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కానుంది.

Leave a Reply