శ్రీనగర్ – పెహల్‌గామ్ దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులపై భారత ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. కశ్మీర్ లోయలో విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల ఇళ్లను భద్రతా బలగాళు ధ్వంసం చేస్తున్నాయి. తాజాగా జమ్ము కశ్మీర్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదులకు చెందిన ఇళ్లను భద్రతా దళాలు పేల్చేశాయి.
షోపియాలోని చోటిపోరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. అదేవిధంగా కుల్గాంలోని మతాలం ప్రాంతంలో టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ నివాసంతోపాటు ఇదే జిల్లాలో లష్కరే ముఠాకు చెందిన మరో ఉగ్రవాది అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి. కుల్గాంలోని ముర్రా ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్ ఉల్ హక్ ఇల్లు, పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో ముష్కరుడు హరీస్ అహ్మద్ ఇంటిని బాంబులతో పేల్చేశాయి.