అదుపులో అతిసార పరిస్థితి…

అదుపులో అతిసార పరిస్థితి…

ఇంటింటి సర్వేలు పూర్తి
పరిస్థితి నియంత్రణలోనే

నందిగామ, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా చందాపురం గ్రామంలో నమోదైన అతిసార కేసుల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సమగ్రంగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని గ్రామాన్ని సందర్శించి, ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న ఆర్‌ఆర్‌టీ బృందాల పనితీరును పరిశీలించారు. రాష్ట్ర స్థాయి అధికారులు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లీశ్వరి, రాష్ట్ర ఆరోగ్య అధికారి డాక్టర్ పద్మజ, రాష్ట్ర ఐడీఎస్పీ విభాగ ఇన్‌చార్జ్ శ్రీహరి వెంకటేశ్వర్లు గ్రామాన్ని సందర్శించి, అతిసార కేసుల పరిస్థితి, కారణాలు, ప్రాథమిక నివేదికలను సమీక్షించారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పణకు అవసరమైన వివరాలను సేకరించారు.

ఇక సిద్ధార్థ మెడికల్ కాలేజీ వైద్య బృందం కూడా గ్రామంలో విస్తృతంగా పర్యటించింది. మైక్రో బయాలజిస్ట్ డాక్టర్ వై. సరిత, కమ్యూనిటీ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ డి. భాను కిరణ్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ వి. జ్యోతి ఇంటింటికి వెళ్లి కేసుల తీవ్రత, వ్యాధి వ్యాప్తి కారణాలను విశ్లేషించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయి అధికారులు పంచాయతీ సిబ్బందితో సమన్వయం చేస్తూ 8 ఆర్‌ఆర్‌టీ బృందాలు గ్రామమంతా సర్వే నిర్వహిస్తున్నాయి.

ప్రస్తుతం ఇంటివద్ద ఉన్న బాధితులందరూ కోలుకున్నారు. నందిగామ ఆసుపత్రి నుండి ఈరోజు 13 మంది డిశ్చార్జ్ కాగా, ఇంకా 15 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు కొత్త కేసులు నమోదు కాలేదు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ వచ్చే రెండు నుంచి మూడు రోజుల పాటు వైద్య, పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తూ పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని ఆదేశించారు.

Leave a Reply