న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వంలోని అతిపెద్ద నియామక సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఒకటి. ఇది ప్రధానంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నాన్-గెజిటెడ్ పోస్టులకు ఎంపిక ప్రక్రియలను నిర్వహిస్తుంది. అయితే కమిషన్ తాజా నిర్ణయంతో రాబోయే పరీక్షల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ప్రామాణీకరణను అమలు చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ఈ ఏడాది మే నుంచి కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ వివరాలను పేర్కొనడంతోపాటు పరీక్ష రోజున పరీక్షా కేంద్రంలో హాజరయ్యేటప్పుడు ఆధార్ బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు.
మోసపూరిత మార్గాలు నిరోధించేందుకు..
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమ గుర్తింపులను నకిలీ చేయకుండా, ఎస్ఎస్సీ నియామక పరీక్షలకు హాజరు కావడానికి మోసపూరిత మార్గాలను ఉపయోగించకుండా నిరోధించేందుకు ఆధార్ ఆధారిత ప్రామాణీకరణ సహాయపడుతుందని అధికారులు వివరించారు. అభ్యర్ధుల ప్రామాణీకరణ మరింత బలంగా ఉంటుందని కమిషన్ జారీ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. ఆధార్ ప్రామాణీకరణ స్వచ్ఛందంగానే ఉంటుందని, అభ్యర్థులకు పరీక్షా ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఉద్దేశించబడిందని కమిషన్ స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 12న జారీ చేసిన నోటిఫికేషన్లో, కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ ప్రామాణీకరణను నిర్వహించడానికి కమిషన్ అనుమతి పొందింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏడు రకాలైన అఖిల భారత బహిరంగ పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. గత ఏడాది ఆగస్టు 28న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలకు ఆధార్ ఆధారిత ప్రామాణీకరణను ఆమోదించిన సమయంలో మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది.