Job Mela : ఉద్యోగ కల్సనే లక్ష్యం

Job Mela : ఉద్యోగ కల్సనే లక్ష్యం
- జాబ్ మేళాకు అద్భుత స్సందన
- – కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పలు పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్లు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళలో ఉద్యోగార్థులకు నియామక పత్రాలను శనివారం కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, డిప్యూటి స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా అందించారు.
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో అనకాపల్లి రామాయ పట్టణం ప్రాంతాల్లో ఏర్పాటు కాబోయే పరిశ్రమల్లో 1.40లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందని, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఈ జాబ్ మేళాకు 2,,600 మంది రిజిస్ట్రేషన్ అవ్వటం చాలా గొప్ప విషయమని, ఇటువంటి జాబ్ మేళాలు మరిన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ విద్యార్థులు మొదటిగా చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైన చేరి తర్వాత తన అనుభవంతో పెద్ద ఉద్యోగాల వైపు వెళ్లాలన్నారు.యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, సద్వినియోగం చేసుకోవాలని, సమయం వృధా చేసుకోవద్దని హితవు చెప్పారు.
రాష్ట్రంలో చాలా కంపెనీలు వస్తున్నాయని, నైపుణ్యం ఉన్నవారు ఉద్యోగాలు పొందుతున్నారని దీనిని యువత గమనించాలని కోరారు. డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణమరాజు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలతో ఎంఓయూ కుదుర్చుకున్నదని అన్నారు.
కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ జాబ్ మేళాలో 600 పైగా ఉద్యోగాలు పొందారని, మరికొన్ని ఉద్యోగాలకు సెకండ్ ఇంటర్వ్యూ అనంతరం మరొక 400 మంది ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కళాశాల సెక్రటరీ సాగి రామకృష్ణ నిషాంత వర్మ, డైరెక్టర్ డా జగపతి రాజు, ప్రిన్సిపల్ డా మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దిలీప్ చక్రవర్తి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డా పి లోకమాన్ తదితరులు పాల్గొన్నారు.
