జయహో స్వచ్ఛతాహి సేవ
- శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పిలుపు
( శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai district) హిందూపురం పట్టణంలో గురువారం జరిగిన శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గురువారం ఉదయం హిందూపూర్ పట్టణం హౌసింగ్ బోర్డ్ మున్సిపల్ పార్క్ వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో… జిల్లాలో చేపట్టిన స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా “ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్” నినాదంతో శ్రమదానంలో శ్రీ సత్యసాయిజిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్, కమిషనర్, (Municipal Chairman, Commissioner) అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్ అసోసియేషన్, స్థానిక మహిళలు తదితరులతో మున్సిపల్ పార్కులో అక్కడి చుట్టుపక్కల పరిసరాలలో చెత్తను ఏరివేయడం, పిచ్చి మొక్కల తొలగింపు, పరిసరాలను పరిశుభ్రం చేయడం తదితరాలలో కలెక్టర్ స్వయంగా పాల్గొన్నారు.
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొంటూ మొక్కలు నాటి, పెంచి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం స్థానికుల ఇళ్ల వద్దకు వెళ్లి విడివిడిగా తడి పొడి చెత్తలను అందజేయడం, మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ((Municipal Chairman) డీఈ రమేష్ మాట్లాడుతూ… హిందూపూర్ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పిలుపుతో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ హిందూపూర్ ను రూపొందించడంలో ప్రజలతో కలిసి ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిశుభ్రతలో బాగా కృషిచేసిన 8 మంది మున్సిపల్ శానిటేషన్ వర్కర్లను స్థానికుల సమక్షంలో శాలువా, మెమెంటోలతో కలెక్టరు, మున్సిపల్ చైర్మన్ సత్కరించారు. హిందూపూర్ పట్టణంలో సప్లమ్మ వీధి సుగూరులో పీఎం సూర్య ఘర్ సబ్సిడీ పథకం ద్వారా లబ్ధిదారు జి. నర్మద ఇంటిపై 3.24 కిలోవాట్లతో ఏర్పాటు చేసుకున్న రూప్ టాప్ సోలార్ ప్లాంట్ ను కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. వీరిని ఆదర్శంగా తీసుకొని.. ప్రతి ఒక్కరూ సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.


