జానకీబాయి యూత్ సేవలు ఆదర్శం

ఎడపల్లి, ఆంధ్రప్రభ: రాణి శీలం జానకీబాయి పేరుతో ఏర్పడిన జానకంపేట గ్రామంలో యువకులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన 2000–01 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు “జానకీబాయి యూత్”గా ఏర్పడి గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు.
సేవా కార్యక్రమాలలో భాగంగా ఆదివారం గ్రామ శివారులోని మహాలక్ష్మి ఆలయం వద్ద రూ.40 వేల వ్యయంతో నిర్మించిన నీటి ట్యాంక్‌ను స్థానిక సర్పంచ్ సుంచనకోట రాధాకిషన్ గౌడ్, ఉపసర్పంచ్ నీలం కృష్ణ, పాలకవర్గ సభ్యులు కలిసి ప్రారంభించారు. ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు యూత్ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ జానకీబాయి యూత్ సభ్యులు పుట్టి పెరిగి విద్యాభ్యాసం చేసిన గ్రామానికి తమ వంతు సేవ చేయడం ఆనందకరమైన విషయమని అన్నారు. వారి సేవా భావం ఇతరులకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని, యూత్ సభ్యులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.
అనంతరం జానకీబాయి యూత్ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో కొరవడిన మౌలిక వసతుల అభివృద్ధికి తమ వంతు చేయూత అందించాలనే ఉద్దేశంతో తమ సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు రూ.5 లక్షలతో గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద సిమెంట్ బెంచీల ఏర్పాటు, గ్రామ అవసరాల కోసం డెడ్ బాడీ ఫ్రీజర్ అందజేత, ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ సప్లైకి సహాయం, గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న శివాలయం వద్ద భక్తుల సౌకర్యార్థం రూ.40 వేలతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిక్కెల లక్ష్మణ్, మిద్దె చిన్నయ్య, ఉప్పు సురేష్, సత్యనారాయణ, రాజగౌడ్, సుదర్శన్, గంగాప్రసాద్ యాదవ్‌తో పాటు జానకీబాయి యూత్ సభ్యులు, వార్డు సభ్యులు ఆకారం సాయిలు, మురళి, క్రాంతి, కరుణాకర్, మహేశ్, మాజిద్, పోశెట్టి, రాజలింగం, సురేష్, భాస్కర్, పవన్, మురళి, ఆవేశ్ తదితరులు పాల్గొన్నారు.
