తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేవలం కక్షతో పలు అనుచిత పనులు చేసిన జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కక్ష పూరిత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖల మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) అన్నారు. ఇవాళ గూడూరు (Gudur) పర్యటనకు వెళ్తూ తిరుపతిలోని ఒక హోటల్ లో ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ… అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు బయటపడుతుంటే కక్షపూరిత రాజకీయాలని వైసీపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
వాస్తవానికి ప్రజావేదిక (prajavedika) ను కూల్చింది కక్షపూరితంగా కాదా.. చంద్రబాబు (Chandrababu) పై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసింది కక్షపూరితంగా కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యక్తిగత కక్షలకు వ్యతిరేకమని, కక్ష సాధింపులు లేని ప్రభుత్వం కాబట్టే ప్రజలు తమను గెలిపించారన్నారు. నాడు కక్షపూరిత రాజకీయాలు మొదలుపెట్టిన జగన్ కు నేడు అన్ని కక్షపూరితంగానే కనిపించడంలో ఆశ్చర్యం లేదన్నారు. ఎన్నికలకు ముందు నుంచి తాము లిక్కర్, శాండ్, ల్యాండ్ మాఫియాతో ప్రజల్ని దోచుకుంటున్నారని చెబుతూనే వచ్చామని, నాడు దోపిడీ చేసి, దేశ విదేశాల్లో దాచుకున్నదే నేడు పత్రికల్లో వెలుగులోకి వస్తున్నాయన్నారు.
దేశంలో ఎక్కడైనా డిజిటల్ చెల్లింపులు లేని ప్రభుత్వ వ్యవస్థ ఉందా.. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థల్లో.. నగదు చెల్లింపులు జరుగుతాయా అనే ప్రశ్నలకు వైసీపీ వారే సమాధానం చెప్పాలన్నారు. అయినా మద్యం కుంభకోణంలో జరిగిన దోపిడీ బయటపెడ్తున్నది చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు కాదని, సమగ్రంగా విచారించి దర్యాప్తు చేస్తున్న అధికారిక వ్యవస్థ అని చెబుతూ మద్యం కుంభకోణంలో అసలు నిందితులు ఎవరనేది త్వరలో వెలుగులోకి వస్తుందన్నారు. అధికారంలోకి వస్తుంటారు.. పోతుంటారు.. కానీ దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలు.. తన పని తాను చేసుకుంటూ పోతాయని, ఈ దోపిడీలో భాగస్వాములైన వారికి శిక్ష తప్పదని, రూ.4 వేల కోట్ల దోపిడీ సొమ్ము ఎక్కడికి పోయాయి.. ఎవరికి చేరాయి.. అనేది కూడా బయటకు వస్తాయన్నారు. మద్యం కుంభకోణంకు సంబంధించి ఛార్జ్ సీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉందని, విచారణ జరుగుతున్న అంశంపై అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ విచారణ కొనసాగుతున్న సమయంలో మంత్రిగా తాను స్పందించలేనని అంటూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వారి వివరాలు రెడ్ బుక్ లో ఉంటాయని, తప్పులకు పాల్పడిన వారిపై మాత్రమే చర్యలు ఉంటాయని అంటూ నాడు.. తప్పు చేసిన వారికి మాత్రమే నేడు రెడ్ బుక్ భయం పట్టుకుందన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం పడిపోతుందని జగన్ అన్న మాటల పై స్పందిస్తూ… ఆ మాట చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి ఎవరు.. ప్రజలు అనుకుంటే పడగొడతారు.. అవసరమైతే గెలిపిస్తారని, ఇంకా ఏడాది కూడా పూర్తి కాకుండానే అప్పుడే అధికారంపై అంత తొందరెందుకు అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. ఒక మహిళను విమర్శించడం మేము సమర్ధించబోమని అంటూ గతంలో రోజా అధికారంలో మంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబాల గురించి ఏ భాషలో మాట్లాడారో కూడా గుర్తుంచుకోవాలని, ఆ మాటలు గుర్తొస్తే నాటి బాధితులకు కూడా బాధ కలుగుతుంది కదా అన్నారు.
తమ శాఖ గురించి మాట్లాడుతూ.. గతంలో ఆర్ అండ్ బీ శాఖ తల ఎత్తుకు తిరిగేదని, గత ఐదేళ్ల పాలనలో ఆర్ అండ్ బీ సేకరణ పూర్తిగా నిర్వీర్యం చేశారని అంటూ వైసీపీ ప్రభుత్వంలో 25వేల కి.మీ మేర గోతులు పడితే రూ.1200 కోట్లతో ఏడాది కాలంలోనే గుంతల రహితంగా తీర్చిదిద్దిన ఘనత తమ కూటమి ప్రభుత్వానిదన్నారు. గతంలో ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్లు తల ఎత్తుకొని తిరిగేవారని, వైసీపీ ప్రభుత్వంలో వారు చేసిన బిల్లులు రాక ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఆరోపిస్తూ వైసీపీ హయాంలో చేసిన అప్పులు రూ.2500 కోట్లు తీర్చిన ఘనత కూడా తమ కూటమి ప్రభుత్వానిదేనని పేర్కొంటూ రాష్ట్రంలో త్వరలో కొత్త రోడ్ల నిర్మాణానికి డీపీ ఆర్ లు తయారు చేస్తున్నామన్నారు.