AP | జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్ : నారా లోకేష్

వెల‌గ‌పూడి : వైసీసీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను తాను ఏపీ సద్దాం హుస్సేన్ గా ఊహించుకున్నార‌ని, అందుకే 30ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతానని కలలు కన్నారంటూ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. శాస‌న‌స‌భ‌లో రుషికొండ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెబుతూ… ‘తొలుత ఇది ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖ ప్రాజెక్ట్.. తర్వాత అది శిశ్ మహల్ గా మారింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనను తాను ఏపీ సద్దాం హుస్సేన్ గా భావించారు. అందుకే మరో 30ఏళ్ల పాటు తానే పదవిలో ఉంటానని నమ్మి.. అంత విలాసవంతమైన‌ భవనాన్ని నిర్మించారు’ అని చెప్పుకొచ్చారు.

‘మా తాత, నాన్న ఇద్దరు ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ వారి హయాంలో నేను ఇంత విలాసవంతమైన భవనాన్ని, ఇంత పెద్ద గదులను చూడలేదు. శిశ్ మహల్ నిర్మాణం కారణంగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ రాష్ట్ర ప్రభుత్వం మీద 200 కోట్ల రూపాయల జరిమానా విధించింది.. దానిని కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టాల్సిన దుస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు. నిర్మాణానికి రూ.700 కోట్లు, జ‌రిమానాకు రెండు వంద‌ల కోట్లు ప్ర‌జాధ‌నం వృథా అయ్యింద‌ని చెప్పారు.

‘వైసీపీ అధ్యక్షుడిది చాలా చిన్న కుటుంబం. ఆయన తల్లి, సోదరిలను కుటుంబం నుంచి పంపించి వేశారు. ప్రస్తుతం ఆయన, భార్య, పిల్లలు మాత్రమే ఉన్నారు. కేవలం నలుగురు కుటుంబ సభ్యుల కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆఖరికి ప్రధాన మంత్రి కూడా ఇంత పెద్ద ఇంట్లో నివాసం ఉండరు’ అని అంటూ వైట్ ఎలిఫెంట్ గా మారిన ఆ భ‌వ‌నాన్ని తమ ప్రభుత్వం ఆ భవనాన్ని ఎలా వినియోగించుకోవాలి అనే అంశంపై ఆలోచనలు చేస్తుందని తెలిపారు.

Leave a Reply