Jagan: పల్నాడు టూర్ కు జగన్ కు అనుమతి

పల్నాడు : ప‌ల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో రేపు జరగనున్న వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు (Naga Malleswara Rao) విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆ పార్టీ అధినేత జగన్ (Jagan) హాజరుకానున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి భద్రతా కారణాల దృష్ట్యా జగన్ తో సహా కేవలం వంద మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెల్లడించారు.

జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్‌చార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి (Sudhir Bhargav Reddy) పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్థనను పరిశీలించిన అనంతరం ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ… విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది ప్రజలు హాజరవుతారని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

అయితే, విగ్రహావిష్కరణ (Statue unveiling) జరిగే ప్రదేశానికి కేవలం పది అడుగుల వెడల్పు ఉన్న దారి మాత్రమే ఉందని, ఆ దారికి ఇరువైపులా నివాస గృహాలు ఉన్నాయని ఎస్పీ వివరించారు. ఈ కారణంగా, ఆ ప్రాంతంలో వంద మంది కంటే ఎక్కువ మంది గుమిగూడటానికి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల్లో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ కాన్వాయ్‌తో పాటు అదనంగా మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఎస్పీ చెప్పారు.

శాస్త్రీయమైన అంచనాల ప్రకారమే అనుమతులు మంజూరు చేస్తున్నామని, ఒకవేళ నిర్దేశించిన నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఈ సందర్భంగా హెచ్చరించారు. భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply