కాలిపోయింది.. బస్సు మాత్రమే కాదు.. మానవత్వం కూడా..
కర్నూలు బ్యూరో, (ఆంధ్రప్రభ) : ఇల్లు కాలిపోయి ఒకరి కన్నీళ్లు ఎండక ముందే, మరొకరి కళ్లలో దాహం కనిపిస్తోంది. బంగారం కోసం, వెండి కోసం.. మృత్యువు తన ఘోర నృత్యం ముగించి వెళ్లినా, మానవత్వం మాత్రం ఆ అగ్నిజ్వాలల్లోనే దగ్ధమైపోయిందేమో అనిపిస్తోంది. కర్నూలు జిల్లా (Kurnool District) లో ఈ నెల 24న చిన్నటేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఆ ఘోర దృశ్యాలు ఇప్పటికీ ప్రజల మనసుల్లో మసకబారలేదు. బస్సులో చిక్కుకుని మంటల్లో అల్లాడిన వారి అరుపులు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. బతికిన వారు కూడా ఆ భయంకరమైన క్షణాలను మరచిపోలేక నిశ్శబ్దంగా గడుపుతున్నారు.
అయితే.. ఈ అంతటి విషాదం మధ్యలోనూ, కొందరి ప్రవర్తన మనిషితనాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రమాదం జరిగిన కొన్ని రోజులు గడవకముందే, అధికారులు కాలిపోయిన బస్సు(burnt bus) ను రోడ్డుకు దూరంగా తరలించారు. అక్కడికి కొందరు వ్యక్తులు చేరుకున్నారు. కన్నీరు తుడుచుకునేందుకు కాదు, మృతులకు నివాళి అర్పించేందుకు కాదు. బస్సులో ప్రయాణించిన వారి ఆభరణాల కోసం. బూడిదను సంచుల్లో వేసుకుని, ప్రతి ఇంచ్ వెతుకుతూ బంగారం, వెండి కోసం తవ్వుతున్న దృశ్యం చూసిన వారికి గుండె తరుక్కుపోతుంది. ప్రాణాలు బూడిదైపోయిన చోట కూడా ఎవరికో లాభం కనబడుతుంటే, మనుషులలోని మానవత్వం ఎక్కడికి పోయిందన్న బాధ కలుగుతోంది.
అపాయ సమయంలో మనుషుల మనసుల్లో దయ, దుఃఖం, సానుభూతి లేకుండా కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కనిపించడం.. సమాజం ఎంత క్రూరమైపోతుందో చెప్పకనే చెబుతోంది. ఒక పక్క తమ కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీరు ఆరని కుటుంబాలు, మరో పక్క మృతుల జ్ఞాపకాల బూడిదలో లాభం వెతికే మనుషులు ఈ విరుద్ధ దృశ్యం మానవతకు అద్దం పడుతోంది. సామాజికంగా, నైతికంగా, మానవీయంగా మనం ఎంత వెనుకబడి పోతున్నామో ఈ దృశ్యం సాక్ష్యం చెబుతోంది. ప్రాణం కంటే బంగారం విలువ ఎక్కువగా మారిన ఈ కాలంలో, మానవత్వం మళ్లీ సజీవమవ్వాలని కోరుకోవడం ఇప్పుడు అవసరం అయింది. మంటల్లో కాలిపోయ్యింది బస్సు మాత్రమే కాదు… మానవత్వం కూడా.

