Isro Launches | బాహుబలి ప్రయోగం గ్రాండ్ సక్సెస్..
- 15నిమిషాల్లో ప్రయోగం పూర్తి..
- నింగిలోకి చేరిన బ్లూ బర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం..
- ప్రయోగం విజయవంతం కావడంతో షార్ లో సంబరాలు..
- కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు..
- ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్ నారాయణన్..
Isro Launches | నాయుడుపేట, ఆంధ్రప్రభ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన బాహుబలి రాకెట్ ఎల్వీఎం 3-ఎం6 ప్రయోగం విజయవంతం అయింది. బుధవారం ఉదయం 8.54 గంటలకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC- షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఇస్రో ఈ బాహుబలి రాకెట్ LVM3-M6 (లాంచ్ వెహికల్ మార్క్-3 M6)ను విజయవంతంగా ప్రయోగించింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉప గ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను రాకెట్ మోసుకెళ్లింది. 15 నిమిషాల్లో మూడు దశల్లో రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఉపగ్రహం బరువు సుమారు 6,100 కిలోలు, అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. సుమారు 6,100 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం ఇస్రో ఇప్పటి వరకు ప్రయోగించిన అత్యంత బరువైన వాణిజ్య పేలోడ్గా రికార్డు సృష్టించింది. దీంతో ఇస్రో కేంద్రంలో సంబరాలు మొదలయ్యాయి.

Isro Launches | కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు
ఈ ప్రయోగం ప్రపంచ కమ్యూనికేషన్ రంగంలోనే విప్లవాత్మక మార్పులకు బాటలు వేయనుంది. బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం ద్వారా సాధారణ స్మార్ట్ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుండి 4G/5G సిగ్నల్స్ అందుతాయి. దీనివల్ల ఎటువంటి సిగ్నల్స్ లేని మారుమూల ప్రాంతాల్లో కూడా మొబైల్ సేవలు పొందే వీలుంటుంది. లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లో అతిపెద్ద వాణిజ్య ఉపగ్రహంగా గుర్తింపు పొందిన దీని యాంటెన్నా విచ్చుకున్న తర్వాత ఏకంగా 223 చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుంది. ఈ విజయంతో అంతర్జాతీయ వాణిజ్య అంతరిక్ష మార్కెట్లో భారత్ మరోసారి తన సత్తా చాటింది.

Isro Launches | శాస్త్రవేత్తలను అభినందించిన ఇస్రో చైర్మన్ నారాయణ

శ్రీహరి కోట నుంచి చేపట్టిన ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతంగా నింగిలోకి చేరుకోవడంతో షార్ లో సంబరాలు మొదలయ్యాయి. ప్రయోగం విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఇస్రో (Isro) చైర్మన్ డాక్టర్ నారాయణన్ అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
CLICK HERE TO READ మళ్ళీ షీల్డ్ పట్టనున్న కెప్టెన్ అమెరికా..

