ISRO | బాహుబలి రాకెట్ ప్రయోగం..

ISRO | బాహుబలి రాకెట్ ప్రయోగం..
- రెండవ ల్యాంచ్ ప్యాడ్ నుంచి ఎల్‌వీఎం3-ఎం6 రాకెట్ ప్రయోగం..
- ఉదయం 8.54గంటలకు నింగిలోకి చేరనున్న రాకెట్..
- ప్రయోగం విజయవంతం అయితే..
- విస్తరించనున్న బ్రాడ్ బ్యాండ్ సేవలు..
- షార్ లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు..
ISRO | నాయుడుపేట, ఆంధ్రప్రభ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి శాస్త్రవేత్తలు ఎల్వీఎం 03 – ఎం6 రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఎల్వీఎం-3 ఎం6 (LVM3 -M6) అనే బాహుబలి రాకెట్ ప్రయోగం ద్వారా భారత్ – అమెరికా సంయుక్తంగా టెక్సాస్ కేంద్రంగా పని చేస్తున్న ఏ స్పేస్ మొబైల్ సంస్ధ రూపొందించిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ రాకెట్ (Rocket) ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ మంగళవారం 8.54 గంటలకు మొదలై 24గంటల పాటు కొనసాగనుంది.

బుధవారం ఉదయం 8.54 గంటలకు కౌంట్ డౌన్ 0కి చేరుకోగానే నిప్పులు చిమ్మూతూ నింగిలోకి చేరనుంది. సుమారు 15.7 నిమిషాలలో ప్రయోగాన్ని పూర్తి చేసేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. బాహుబలి రాకెట్ ద్వారా అమెరికా దేశానికి చెందిన AST స్పేస్ మొబైల్ సంస్ధ రూపొందించిన 6.5 టన్నుల బరువు కలిగిన శాటిలైట్ (Satellite) ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే.. మోబైల్ బ్రాండ్ బ్యాండ్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో రానున్నాయి. బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరించనున్నారు. గతంలో పంపిన శాటిలైట్ల కంటే ఈ శాటిలైట్ పదిరెట్ల అధిక సామర్ధ్యంతో పని చేయనుంది. ప్రయోగ నేపథ్యంలో ఇప్పటికే ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ఇస్రోకి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ఇస్రో చేపడుతున్న వందో ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, అంతరిక్ష రంగ నిపుణుల్లో ఈ ప్రయోగం పై విశేష ఆసక్తి నెలకొంది. రాకెట్ ప్రయోగించనున్న నేపథ్యంలో షార్ లో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.

