ప‌ట్టు త‌ప్పిందా..

ప‌ట్టు త‌ప్పిందా..

యానాదుల పల్లెలో జీవన పోరాటం..

చెక్‌డ్యాం మీదే రాకపోకలు..
వర్షం పడితే బయట ప్రపంచంతో సంబంధాలు కట్..
15 కిలోమీటర్లు తిరిగి తిరిగి వెళ్లాలి..

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ పరిధిలోని ఏటి గడ్డ యానాదుల కాలనీ, మొసలి మడుగు, కృష్ణాపురం, సముద్రపల్లి పాల డైయిరీ పరిసర గ్రామాలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. కౌండిన్యా నదిపై వంతెన లేకపోవడం ఈ ప్రాంత ప్రజలకు ప్రతిరోజూ ఒక పోరాటంలా మారింది. కౌండిన్యా నదిపై వంతెన కల ఇంకా నెరవేరలేదు. ఇప్పటికి ప్రమాదం అంచున చెక్‌డ్యాం మీదేనే రాకపోకలు సాగిస్తున్నారు. ఇది ప్రమాదం అని తెలిసినా, గత్యంతరం లేని పరిస్థితి. వర్షం పడిందంటే బయట ప్రపంచానికి ముసలిమడుగు యానాదుల కాలనీ కృష్ణాపురం గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోతాయి. పలమనేరు వెళ్లాలన్న చెక్ డాం మీద నుంచి వెళ్లాలి. చెక్ డాం మీద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తుంటే పిల్లలు మహిళలు జారీ పడిపోతున్నారు. వర్షం పడితే విద్యార్థులకు సెలవే మరి. గర్భిణుల‌ను తీసుకెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రజాప్రతినిధులు మారుతున్నా యానాదుల జీవితాలు మాత్రం మారడం లేదు. వారు నిత్యం సమస్యలతో సహజీవనం చేస్తున్నారు.

వంతెన లేక‌..
ఈ ప్రాంతానికి కౌండిన్యా నది జీవనాడి. అయితే అదే నది వంతెన లేక ప్రజల రాకపోకలకు అడ్డంకిగా మారింది. నది మీద ఒక చెక్‌డ్యాంను నిర్మించారు. వర్షాకాలంలో చెక్‌డ్యాం నీటితో నిండిపోతుంది. ఉదృతంగా చెక్‌డ్యాం మిద నీళ్లు ప్రవహిస్తాయి. నీరు తగ్గిన రోజుల్లో ప్రజలు ఈ చెక్‌డ్యాం మీదుగా వెళ్తారు. వర్షం పడితే దారే ఉండదు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఇలా ఎవరికైనా చెక్‌డ్యాం దాటడం అంటే ప్రాణపణంగా ప్రయాణం చేయడమే. మొసలి మడుగు గ్రామం నుంచి పలమనేరు చేరుకోవాలంటే నేరుగా రోడ్డు ఉంటే అర కిలోమీటరే. కానీ వంతెన లేకపోవడంతో ప్రజలు కృష్ణాపురం మీదుగా 15 కిలోమీటర్ల తిరుగు ప్రయాణం చేస్తున్నారు. ఆ మార్గంలో ఆటోలు లేకపోవడంతో, ఒక్కసారి ప్రయాణానికి రూ.50 ఖర్చు పెట్టి బైక్ లేదా ఇతర వాహనాల మీద వెళ్లాల్చి వస్తోంది.

విద్యార్థులు, రైతులు, దినసరి కార్మికులు ప్రతిరోజూ ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఏటి గడ్డ యానాదుల కాలనీలో సుమారు 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో చాలామంది వ్యవసాయ కూలీలు. నదికి ఈవైపు మొసలి మడుగు గ్రామంలో మరో 150 కుటుంబాలు ఉంటే, అందులో 80 శాతం మంది రైతులు. ఈ రెండు గ్రామాల మధ్య దూరం తక్కువైనా, నది అవరోధం వీరి జీవితాలను విడగొట్టింది. విత్తనాలు, ఎరువులు, కూరగాయలు, పాలు, పంటల రవాణా అన్నింటికీ కష్టమే. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు, అనారోగ్య బాధితులు ఆసుపత్రికి వెళ్లాలంటే వర్షాకాలంలో సాధ్యం కాదు. వర్షాలు తగ్గి, నీటి ప్రవాహం ఉదృతి తగ్గే వరకు ఎదురు చూడాల్సిందే. ఈ ప్రాంత ప్రజల గోడును వినడానికి అధికారులూ, ప్రజాప్రతినిధులూ రావడం లేదని స్థానికులు చెబుతున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం సముద్రపల్లి పాల డైయిరీ నుంచి ఏటి గడ్డ యానాదుల కాలనీ వరకు సిమెంట్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. కానీ. నది మీద వంతెన నిర్మించడం లేదు. వంతెన లేకుండా రోడ్డు వేస్తె, ఏం ప్రయోజనం ఉంటుందని యానాదులు ప్రశ్నిస్తున్నారు. నదిని దాటే చెక్‌డ్యాం మీదుగా పిల్లలు, వృద్ధులు, మహిళలు నడుస్తూ వెళ్తున్న దృశ్యం చూస్తే మనసు కదిలిపోతుంది. కౌండిన్యా నదిపై ఒక చిన్న వంతెన నిర్మాణం ఇక్కడి వందలాది కుటుంబాల జీవితాలను మారుస్తుంది. కౌండిన్యా నది మిద వంతెన కోసం యానాదులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 8 వ తేదిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలమనేరు రానున్నారు. అనయన అయినా తమ మొర ఆలకించి, నది మిద వంతెన నిర్మిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బ్రిడ్జి కడితేనే బతుకులు మారుతాయి.
వంతెన వస్తే మా జీవితాలు మారతాయి. మా పిల్లలు చదువుకుంటారు. మేము సురక్షితంగా ప్రయాణిస్తాం. పిల్లల్ని స్కూల్‌కు పంపడం అంటే మాకు భయం. నీరు ఉంటే తిరిగి ఇంటికే వచ్చిపోతారు. కొన్నిసార్లు చెక్‌డ్యాం మీద జారిపడి పడిపోవడం కూడా జరుగుతుంది. పింఛ‌న్ తీసుకోవడానికి వెళ్ల‌డానికి కూడా ఇబ్బందిగా ఉంది. 15 కిలోమీటర్లు తిరిగి పోవాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం.

ఆరోగ్యం బాగా లేకపోతే అంతే సంగతి
ఒకవేళ రాత్రి ఎవరైనా బాగోలేకపోతే, కృష్ణాపురం మీదుగా వెళ్లి వస్తే సగం ప్రాణం పోతుంది. ఇక్కడ అంబులెన్స్ కూడా రాదు. ఎన్నో ఏళ్లుగా వంతెన కోసం అడుగుతున్నాం. ఎవరికీ వినడంలేదు. వర్షం వస్తే మా గ్రామం ప్రపంచం నుండి వేరుపడిపోతుంది. మాకెవరూ దిక్కు లేదు. చెక్ డాం మీద బాగా పాచి కట్టింది. ఒక్కొక్కసారి జారీ పడిపోతున్నాము. పిల్లలు, గర్భిణులు, వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వస్తే కూలి పనులు కూడా వెళ్లలేకపోతున్నాం.

Leave a Reply