రైతు ఉత్పత్తిదారుల కేంద్రంలో అక్రమాలు

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
డైరెక్టర్లు, రైతులు డిమాండ్
మోతె, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని రైతు ఉత్పత్తిదారుల కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు డైరెక్టర్ లు, రైతులు ఆఫీస్ ముందు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు డైరెక్టర్ లు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం పది మంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఒక్కొక్కరి నుంచి రూ.4 వేలు వసూల్ చేసి మొత్తం సుమారుగా 40 వేలు ఖర్చు పెట్టి రిజిస్టర్ చేసినట్లు తెలిపారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా గోళ్ళ మధుసూదన్ రెడ్డి, కోశాధికారిగా దోసపాటి రాములు పేరుతో బ్యాంకులోని జాయింట్ అకౌంట్లో సుమారు రూ.3 లక్షల 50 వేలు జమ అయినట్లు తెలిపారు.
ఈ నగదు జమ అయిన తదుపరి ఎటువంటి తీర్మానాలు, ఆధారాలు లేకుండా అధ్యక్షుడు, కోశాధి కారిని తొలగించి అప్పటివరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న బొక్క ఉపేందర్ రెడ్డి అధ్యక్షుడిగా కొనసాగారన్నారు. తదుపరి తన ఇష్టం వచ్చిన వారిని ఇతర పదవుల్లో నియమించుకొని జాయింట్ అకౌంట్లో జమ అయిన డబ్బులకు లెక్కలు చెప్పడం లేదని ఆరోపించారు. నేటి వరకు సుమారు రూ. 10 లక్షలకు పైనే అక్రమాలు జరిగాయన్నారు.
దీనిలో యఫ్ఏఓ శ్రీనివాస్ రావు, సీఈఓ సతీష్ అధ్యక్షులు బొక్క ఉపేందర్ రెడ్డిల పాత్ర ఉందని ఆరోపించారు. రైతు ఉత్పత్తి దారుల కేంద్రం అకౌంట్లో జమైన నగదు గురించి అడిగిన డైరెక్టర్లను పోలీసులతో కేసులు నమోదు చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ కమిటీ అధ్యక్షుడే తన బిడ్డ సీఈఓగా, భార్య ను మరో పోస్ట్‌లో పెట్టి ఒకే కుటుంబానికి చెందినవారే రైతుల పేరుతో సొసైటీని ఏర్పాటు చేశారంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని అధికారులు అర్థం చేసుకోవాలన్నారు. సొసైటీ సొమ్మును కాజేస్తున్న అధ్యక్షునిపై, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోరారు.
