Iran Action Attribution : చిక్కొద్దు.. దొరకొద్దు Andhra Prabha Analysis

Iran Action Attribution : చిక్కొద్దు.. దొరకొద్దు Andhra Prabha Analysis
- అమెరికా–ఇరాన్ ఫైట్
- టామ్ అండ్ జెర్రీ గేమ్
- రంజాన్ చీకట్లో ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీ
- అమెరికా వ్యూహం తప్పటడుగులు
- వార్ ఆఫ్ అట్రిషన్ ఇరాన్ వ్యూహం
- డ్రోన్ యుద్ధంతో.. అమెరికాకు ముచ్చెమటలు
- హోర్ముజ్ మూసివేతతో ప్రపంచం కుదేలు
- డ్రోన్లు లక్షల్లో… మిసైల్స్ కోట్లలో:
- ఇదీ తాజా యుద్ధం ఖర్చు
- యుద్ధ విరమణకు యూఎన్ ఓ పావులు
( ఆంధ్రప్రభ, ఎనాలిసిస్ ప్రతినిధి )

అణ్వాయుధ విపత్తు చెర నుంచి విముక్తిని ప్రసాదించి.. విశ్వ శాంతి దూతగా.. నోబెల్ ఫ్రైజ్ అందుకోవాలనే గంపెడాశతో.. సహచరి ఇజ్రాయెల్ సమేతంగా ఆపరేషన్ ఎఫిక్ ప్యూరీ రథం ఎక్కిన గ్లోబల్ హీరో డోనాల్డ్ ట్రంప్ కథ అడ్డం తిరిగింది. ఇరాన్ చమురు కుడితిలో చిక్కి.. గావు కేక పెట్టే పరిస్థితి ఏర్పడింది. అణ్వయుధానికి ఆయుధమే సమాధానం అంటూ .. ప్రపంచ శాంతికి నయా సూక్తి వల్లించి… ఇరాన్ పై దాడికి దిగిన అమెరికా కేవలం పశ్చిమాసియానే కాదు.. యావత్తు ఆసియా ఖండాన్ని కకావికలం చేసింది. ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంతో ఆకలి దప్పులతో అల్లాడే సీన్ క్రియేట్ చేసింది.

ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. ఓ అసాధ్య ఆపరేషన్ చేపట్టి అసమర్థ అవార్డుకు అర్హత సాధించాఢని తాజాగా ప్రపంచ దేశాలు తిట్టి పోస్తున్నాయి. సుప్రీం లీడర్ ను లేపేస్తే.. కన్నీళ్లతో బావురుమంటూ.. తమ ముందు మోకరిల్లుతుందని అమెరికా అధ్యక్షుడు ఆశిస్తే.. ఇరాన్ చిక్కటం లేదు. దొరకటం లేదు. పిచ్చుకాస్త్రాలతో (డ్రోన్స్) మైండ్ గేమ్ ఆడేస్తోంది. ఓ చీమ, ఓ నల్లి, ఓ దోమను నలినినట్టు ఇరాన్ ను నలిపివేస్తానని ట్రంప్ హూంకరిస్తే..బలమైన సర్పాన్ని చలి చీమలు చంపేస్తే.. ఈ అనకొండ అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేయటానికి ఈ సింగిల్ చీమ చాలు అన్నట్టు ఇరాన్ తప సప్త వ్యహాలతో అష్టదిగ్భంధనం చేస్తోంది.
Iran Action Attribution : ఇదీ టామ్ అండ్ జెర్రీ గేమ్

మధ్య ప్రాచ్చాన్ని మారణ కాష్టంగా మార్చిన అమెరికాకు తన అపార సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చితే.. ఈ చిట్టెలుక ఇరాన్ ఎందుకు చిక్కటం లేదు. నిజమే అమెరికా, ఇజ్రాయెల్ ఒక వైపు ఇరాన్ మరో వైపు తలపడుతున్న వైనం టామ్ అండ్ జెర్రీ గేమ్ ను తలపిస్తుంటే.. ఇక వీక్షకులకు హాస్యం పండటం లేదు.. ఒళ్లు మండిపోతోంది. ఇది యుద్ధం కాదు, జస్ట్ విహార యాత్రతో పశ్చిమాసియా యుద్ధాన్ని అమెరికా అధ్యక్షుడు అభివర్ణిస్తున్నారు. నిజమే ఇది విహార యాత్రే.. ఇందులో జరిగే టామ్ అండ్ జెర్రీ గేమ్ లో గెలిచేది చిట్టి ఎలుకే.. అని సోషల్ మీడియాఎద్దెవ చేస్తోంది. అసలు ఈ గేమ్ లో ప్రతి క్షణం ఓటమి అంచుల్లోకి అమెరికా చేరటానికి కారణమేంటీ? అమెరికా వ్యూహం ఎందుకు ఫలించలేదు.

వెనిజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కూల్చి.. అక్కడి చమురు క్షేత్రాలపై అమెరికా జెండా ఎగర వేసినంత ఈజీగా ఇరాన్ లో ఇజ్రాయెల్ పతాకాన్ని ఎగరవేయటం సాధ్యమని ట్రంప్ ఎలా కలకన్నాడు? అది సరే అయతుల్లా ఖమేనీ సంహారం అనంతరం..తన నెక్ట్స్ టార్గెట్ క్యూబా అని గొప్పలు పోయిన.. ట్రంప్.. తాజాగా ఇరాన్ తో యుద్ధాన్ని ఏ మార్గంలో ముగించాలో అర్థం కాని అయోమయ స్థితి ఎదుర్కొంటున్నాడు.

వియత్నాం, ఇరాక్ యుద్ధాల్లో క్షతగాత్ర దశలో.. జనం ఈసడింపులను మూట్టుకున్న రోజుల్ని నెమరువేసుకుని.. యుద్ధం బాగా చేశాం.. ఫలితం దక్కలేదు, అని రిపబ్లికన్ శ్రేణికి అమెరికా అధ్యక్షుడు సారీ చెప్పక తప్పలేదు. ఈ స్థితికి,,గతికి కారణమైన.. ఇరాన్ భూగర్భంలోని యురేనియం నిల్వల నిర్వీర్యం,, ప్రపంచ శాంతే తన లక్ష్యమని శపథం చేసిన.. ట్రంప్ వార్నింగ్ లన్నీ ప్రగల్భాలేనని మిత్ర దేశాలు తమలో తాము నవ్వుకొంటున్నాయి. అమెరికా ప్రజల ముందు అధ్యక్షుడు ట్రంప్ పరువు ప్రతిష్ట ఎందుకు నీరుగారిందో పరిశీలిద్దాం.
Iran Action Attribution : రంజాన్ చీకట్లో దొంగాట

పవిత్ర రంజాన్ మాసంలో ముస్లీంలు కఠోర దీక్షల్లో ఉపవాసాలతో తమ దైవాన్ని ఆరాదిస్తారు. ఈ మాసంలో జగడం ఊసే ఉండదు. సాటి మనిషి ఆకలి దప్పులను తీర్చటమే దైవాజ్ఞగా భావిస్తారు. అణ్వాయుధం వద్దని సర్థి చెప్పేందుకు సౌదీ అరేబియా సహాకారంతో్ మరో వారం రోజుల్లో ఇరాన్ తో అమెరికా అధ్యక్షుడు సర్వసన్నద్ధమవుతున్న వేళ.. అతి తెలివి ప్రదర్శనతో.. ఆపరేషన్ ఎథిక్స్ ఫ్యూరీకి బయలు దేరాడు. కానీ ఇరాన్ పర్వత గర్భంలో యురేనియం జోలికి ఇంత అమాయకంగా ఎలా బయలు దేరాడు? నిజమే.. 650 కిలోల ఎన్ రిచ్ యూరేనియంను నిర్వీర్యం చేయటం అసాధ్యం కాదు. కానీ అత్యంత ప్రమాదకరం. కనీసం ఈ మాత్రం ఇంగితం లేకుండా.. ఓ దేశాధినేతను.. కుటుంబ సభ్యులు.. 40 మంది ఉన్నతాధికారులతో మట్టుబెట్టటమే పెద్ద వీరోచిత స్టోరీగా తన పుస్తకంలో డోనాల్డ్ ట్రంప్ ఎలా రాసుకుంటాడు. ఆయన కోరుకున్న ప్రపంచశాంతి కపోతం నో బెల్.. అంటూ ఎగిరి పోయింది, మతచాంధస వాద దేశం ఈ రోజు తన వ్యూహాలతో.. మానవత్వాన్ని నిద్ర లేపింది.

ఔను.. ప్రపంచ పెద్దన్నగా గౌరవించే దేశాలన్నీ ఈసడించుకుంటున్నాయి. ఆధిపత్యంపై అత్యాశ, అహంభావంతో.. అణ్వాయుధం నెనంతో.. యుద్ధానికి దిగితే ఎవరికి ఏమి ఒరిగింది ? ఈ వార్ ఎవరికి ప్రయోజనం? . రోజుకు 10 బిలియన్ డాలర్ల (రూ.921 కోట్ల) ఖర్చుతో… వందలాది మంది ప్రాణాలు తీసి.. పెద్ద సంఖ్యలో జనాన్ని బీతావహులను చేస్తే… అమెరికాకు లభించిన శాంతి ఎంత? ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షభంలో చిక్కుకుంది. ఈ యద్ధం జరిగే కొద్దీ.. దారిద్య్రం వీధుల్లో నృత్యం చేస్తుంది. వియత్నాం, ఇరాక్ యుద్ధం ఫలితాలే.. ఈ యుద్ధంలో ప్రత్యక్షమై పళ్లు ఇకిలిస్తే.. అమెరికా పెట్టే బేడా సర్దేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ట్రంప్ చేతిలో ట్రంక్ పెట్టే వస్తుంది. ఆర్థిక సంక్షోభాన్నితట్టుకోవటానికి సుంకాలు మీద సుంకాలు సంధించటానికి సరికొత్త పెద్దన్న తెరమీదకు వస్తాడు. ఇది సరఏ.. ఇంతకీ అమెరికాకు ముచ్చెమటలు పట్టటానికి ఇరాన్ సంధించిన అస్త్రం, వ్యూహం ఏమిటీ?
Iran Action Attribution : వార్ ఆఫ్ అట్రిషన్ అస్త్రం

శత్రువును ఒకే దెబ్బతో నాక్ ఔట్ చేయటం కంటే, క్రమంగా శత్రువు శక్తిని, వనరులను, ఆత్మస్థైర్యాన్ని బలహీనపరిచే స్థితే..War of Attrition) అని పిలుస్తారు. నిరంతర నష్టమే లక్ష్యం శత్రువు సైనికులు, ఆయుధాలు ఇతర సామాగ్రిని నిరంతరం దెబ్బతీస్తూ ఆర్థికంగా, భౌతికంగా కుప్ప కూల్చటం ఒక వ్యూహం. పోయేలా చేయడం. యుద్ధం సుదీర్ఘ కాలం సాగితే పోరాట పటుత్వం బలహీన పడుతుంది. తక్కువ వనరులున్న శత్రువును ఈ పద్ధతిలో అలసిపోయేలా చేసి ఓడిస్తారు.

ఇది త్వరితగతిన ముగిసే యుద్ధం కాదు. ఇది నెలలు లేదా ఏళ్లకుఏళ్లు కొనసాగే నిరంతర ఒత్తిడి. ఇజ్రాయెల్ – ఈజిప్ట్ యుద్ధం (1967-1970) దీనిని అధికారికంగా ‘వార్ ఆఫ్ అట్రిషన్’ అని పిలుస్తారు. ఇరాన్, ఇరాక్ యుద్ధం, వియత్నాం, అమెరికా ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా ప్రస్తుతం ఈ క్షేత్రస్థాయి వ్యూహంలోనే సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
Iran Action Attribution : అదే వ్యూంలో.. ఇరాన్

2026 ఫిబ్రవరి 28న అయాతుల్లా ఖమేనీ ఖతంతో.. అమెరికా, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్.. ఎథిక్ ఫ్యూరీ కథ సుఖాంతమైందని వైట్ హౌస్ లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షాంపైన్ బోటిల్ ఓపెన్ చేశాడో లేదో.. తమ సుప్రీంను రంజాన్ సహార్ వేళ చంపేశారని ఇరాన్ ఆగ్రహంతో చెలరేగిపోయింది. ప్రతిదాడికి దిగింది. కానీ ఇక్కడ కీలక ట్విస్ట్ అమెరికాను ఖంగుతినిపించింది. డ్రోన్ పక్షలను ఇరాన్ ఎగరవేసింది.

ఇవ్వన్నీ గల్ణ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను, అమెరికాకు ఆతిథ్యం ఇచ్చిన దేశాల మౌలిక వనరులను దెబ్బతీశాయి. యునైటెబ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాక్ దేశాలను టార్గెట్ చేసింది. సహజ శత్రువు ఇప్రాయెల్ పైకి తన మిత్ర సంస్థ హిజ్బుల్లాను ఎగదోసింది. అన్నిటి కంటే.. ప్రపంచ దేశాల ఆర్థిక స్థితి గతికి కీలక హోర్మొజ్ జలసంధి గేట్లు మూసేసింది. ఈ దారిలో వస్తే ఓడల్ని పేల్చివేస్తామని హెచ్చరించింది. చేతిలో డ్రోన్ లు, క్షిపణులు తరిగిపోగానే ఇరాన్ చేతులు పైకి ఎత్తేస్తుందని అమెరికా భావించింది. కానీ అతి తక్కువ ఖర్చుతో డ్రోన్లను ఉత్పత్తి చేస్తూ.. అమెరికా మిత్ర దేశాలకు కంటిమీద కునుకు లేకుండా ఇరాన్ తన అస్త్రాలను సంధిస్తూనే ఉంది. అమెరికా, ఇజ్రాయల్ దాడులకు ప్రతిదాడులతో సమాధానం ఇస్తోంది. ఇరాన్ ట్రోన్లను కూల్చటానికి అగ్రరాజ్య మిత్ర దేశాలు మిసైల్స్ తో ఇరాన్ డ్రోన్లను కూల్చుతుంటే.. ఇరాన్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో.. డ్రోన్ లను ఉత్పత్తి చేస్తోంది.
Iran Action Attribution : ఇరాన్ ఖర్చు లక్షల్లోనే

ఈ గత 12 రోజుల్లో ఇరాన్ తక్కువ క్షిపణులు, ఎక్కువ డ్రోన్లు వినియోగించింది. ఒక డ్రోన్ తయారీ ఖర్చు రూ.4,5 లక్షలు కాగ.. పేట్రియాట్ క్షిపణి ఖరీదు రూ.1.5 కోట్లు. లక్షల విలువ చేసే ఇరాన్ పిచ్చుకల్ని చెదరగొట్టటానికి కోట్లు ఖర్చుతో,, క్షిపణులు వాడే పరిస్థితి ఏర్పడింది. నెమ్మదిగా ఆయా దేశాల్లో ఆయుధగారాల్లో క్షిపణుల సంఖ్య నీరుగారుతోంది. ఇది సరే… డ్రోన్లకు అడ్డుకట్ట వేయటానికి డ్రోన్ డోమ్‌లు కోసం మళ్లీ అమెరికా వైపు ఎదురు చూసే స్థితి తప్పలేదు. ఇక గల్ఫ్ దేశాల్లో అయిల్ కంపెనీల ధ్వంసంలో ఇరాన్ కీలక పాత్ర పోషించింది. ఫలితంగా ఆయిల్ మార్కెట్ లో ముడి చమురు ధర విపరీతంగా పెరిగింది, అమెరికాపై ప్రపంచ దేశాలన్నీ తిరగబడే రీతిలో.. వార్ ఆఫ్ అట్రిబిషన్ లో.. ప్రస్తుతం ఇరాన్ బిజీబిజీగా ఉంది.
Iran Action Attribution : వార్ వద్దు.. వద్దు

ఇక ఈ యుద్ధాన్ని నిలిపివేయటానికి అమెరికా నానా తంటాలు పడుతోంది. ఆయుధగారంలో ఆయుధాలు బ్యాలెన్స్ పడిపోతోంది. నయానా భయానా ఇరాన్ ను యుద్ధానికి దూరం చేయటానికి అమెరికా శతద శతదా స్రయత్నిస్తుంటే.. ఇక ఐక్యరాజ్య సమితి కూడా రంగంలోకి దిగింది. ముందు ఇరాన్ చర్యలను చర్యలను ఖండించి అమెరికా మార్కులు కొట్టేసింది. కాల్పుల విరమణకు ఇరాన్ ను కోరింది. అందుకు ఇరాన్ కూడా బాగానే స్పందించింది. అంతర్జాతీయంగా తమ హక్కును కాపాడాలని, నష్ట పరిహారం చెల్లించాలని, డిమాండు సహా మూడు షరతులు విధించింది. ఏతా వాతా.. ఈ రాజీ ప్రయత్నిస్తాయో లేదో గానీ..పంచ వినాశనానికి దారి తీసిన ఈ ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీ కాస్త.. ఆపరేషన్ అన్ ఎథిక్ ప్యూరీగా మారిందంటే.. కేవలం ఆరోపణ కాదు. ఇక ఇరాన్ దాచిన యురేనియం కథ కంచికి చేరినట్టేనా? అసలు యురేనియం నిల్వల మిస్టరీ ఏమిటీ? ఆంధ్రప్రభ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

ALSO READ : Aussie Entry గల్ఫ్ లో పెద్దన్న మాయం Andhra prabha Analysis
