భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు తాత్కాలిక బ్రేక్ పడింది. ధర్మశాలలో మే 8న జరగాల్సిన పంజాబ్ – ఢిల్లీ మ్యాచ్ మధ్యలో రద్దు చేశారు నిర్వహుకులు. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా టోర్నమెంట్ వాయిదా పడింది.
తాజాగా భారత్ -పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఈ టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుంది. భద్రతా కారణాల దృష్ట్యా, టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్‌లన్నీ ఆరు వేదికలలో జరుగుతున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ తో సహా 17 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. రేపు (మే 17న) తిరిగి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ జూన్ 3న ముగుస్తుంది.
ఈ క్రమంలో ఇప్పటికే ప్లే-ఆఫ్ రేసులో ఉన్న అన్ని జట్లు ఇప్పటికే టోర్నమెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లు ఇప్పటికే వారి వారి ఫ్రాంచైజీ శిబిరాల్లో చేరి ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. కాగా, రేపు (మే 17న) ఆర్సీబీ – కేకేఆర్ మ్యాచ్‌తో టోర్నమెంట్ తిరిగి ప్రారంభమవుతుంది.
టోర్నమెంట్లో ఇప్పటికే 57 మ్యాచ్‌లు పూర్తవగా… ఏ జట్టు కూడా ప్లే ఆఫ్‌కు అర్హత సాధించలేదు. సన్‌రైజర్స్, రాజస్థాన్, చెన్నై తప్ప మిగిలిన ఏడు జట్లకూ ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఉంది. దీంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగేలా కనిపిస్తోంది.