చిత్రపురి కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తి..

- రిపోర్టులో సినీ ప్రముఖుల పేర్లు
హైదరాబాద్: సినీ కార్మికుల కలల సౌధమైన చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో జరిగిన అక్రమాల కేసు విచారణ పూర్తయింది. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై విచారణ ముగించిన ఎంక్వైరీ కమిటీ, నవంబర్ 27న తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది.
గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ ద్వారా ప్రభుత్వానికి అందిన ఈ ఫైనల్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇందులో పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందని, కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్దల పాత్రపై వివరాలను పొందుపరిచింది.
నివేదికలో ప్రముఖుల పేర్లు…
తుది నివేదికలో ప్రముఖ సినీ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వారిలో తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్‌తో పాటు మరికొందరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
అవకతవకలకు పాల్పడిన సినీ పెద్దల నుంచి మొత్తం రూ. 43.78 కోట్లు రికవరీ చేయాలని కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ మొత్తానికి అదనంగా 18 శాతం వడ్డీని కూడా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్లాట్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై ఈ విచారణ జరిగింది.
