విలోమ హనుమ!

సహజంగా దేవాలయాల్లో హిందు దేవతల విగ్రహాలు నిలబడి లేదా కూర్చొని, పడుకొని ఉన్న స్థితిలో ఉంటాయి. కానీ విచిత్రంగా ఎక్కడా కూడా తలక్రిందులుగా ఉన్న హనుమంతుని విగ్రహాన్ని చూసి ఉండరు. మధ్య ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇండోర్‌ నుండి 25 కి.మీ దూరంలో ఉజ్జయిని రోడ్డులో ఉన్న సాన్వర్‌లోని ఒక పురాతన ఆలయంలో హనుమంతుని విగ్రహం తలక్రిందులుగా ప్రతిష్టించబడింది. దీని వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. బలానికి, జ్ఞానానికి దేవుడిగా పరిగణించబడే హనుమంతుడు శిర్షాసనం వేస్తున్న విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ప్రపంచంలోని ఏకైక, ప్రత్యేకమైన హనుమాన్‌ విగ్రహం ఇండోర్‌ నుండి ఉజ్జయిని వెళ్లే మార్గంలో సాన్వర్‌ సమీపంలో మాత్రమే ఉంది. ఆలయంలో తలక్రిందులుగా ఉన్న హనుమంతుడి విగ్రహం గురించి, స్థానికులు శ్రీరాముడుకి రావణుడికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, రావణుడి స్నేహితుడు పాతాళరాజ్‌ అహరావణ తన వేషాన్ని మార్చుకుని రాముడి సైన్యంలో చేరి రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు అహరావణుడు తన మాయా శక్తులను ఉపయోగించి శ్రీరాముడిని, లక్ష్మణుడిని స్పృహ కోల్పోయేలా చేసి, వారిని అపహరించి పాతాళానికి తీసుకెళ్లారని చెబుతారు.
అహరావణుడు రామలక్ష్మణులను పాతాళలోకానికి తీసుకెళ్లి బలి ఇవ్వబోతున్నాడని వానర సైన్యంతో పాటు హనుమంతుడు తెలుసుకొని పాతాళలోకాన్ని వెతుక్కుంటూ వెళ్లి అహరావణుడితో పాటు రాముడు, లక్ష్మణులు పోరాడి అతన్ని చంపి వారిని పాతాళలోకం నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. అందువల్ల, సాన్వర్‌లోని తలక్రిందులుగా ఉన్న హనుమాన్‌ ఆలయంలో ప్రతిష్టించబడిన ఈ విగ్రహం పాతాళంపై హనుమంతుడు సాధించిన విజయానికి చిహ్నంగా చాలా మంది నమ్ముతారు. హనుమంతుడు పాతాళలోకానికి వెళుతున్నప్పుడు, ఆ సమయంలో ఆయన పాదాలు ఆకాశం వైపు తల భూమి వైపు ఉన్నాయి. అందుకే ఆయన విలోమ రూపాన్ని ఇక్కడ పూజిస్తారు. ఈ ఆలయంలో హనుమంతుడితో పాటు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఒక ప్రధాన నమ్మకం ఏమిటంటే, ఒక వ్యక్తి మూడు మంగళవారాలు లేదా ఐదు మంగళవారాలు నిరంతరం దర్శనం కోసం ఈ ఆలయానికి వస్తే, అతని కష్టాలన్నీ తొలగిపోతాయని, అతని కోరికలన్నీ కూడా నెరవేరుతాయని. మంగళవారం నాడు హనుమంతుడికి చోళ నైవేద్యం పెట్టాలనే నమ్మకం కూడా ఉంది. ఆలయ సముదాయంలో రావి, వేప, తులసి, మర్రి చెట్లు ఉన్నాయి. ఇక్కడ అనేక మంది సాధువుల సమాధులు ఉన్నాయి. క్రీస్తు శకం 1200 వరకు చరిత్ర ఇక్కడ అందుబాటులో ఉంది. ఆలయం చుట్టూ ఉన్న చెట్లలో చిలుకల గుంపులు కూడా చాలా ఉన్నాయి.

  • ఆళవందార్‌ వేణు మాధవ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *