నేటి నుండి ఇంటర్ క్లాసులు..

నేటి నుండి ఇంటర్ క్లాసులు..
- ఏప్రిల్ నుంచే ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం..
- ఎన్టీఆర్ జిల్లాలో కొత్త షెడ్యూల్ అమలు..
- జూన్ బదులు ముందుగానే తరగతులు
- ఏప్రిల్ 23 వరకు బోధన, అనంతరం వేసవి సెలవులు
- జూన్ 1న తిరిగి కాలేజీలు ప్రారంభం
- ఫస్టియర్‌కు బ్రిడ్జ్ కోర్సులు
- జిల్లాలో 100కి పైగా ఇంటర్ కళాశాలలు
- సెకండియర్‌కు ముందస్తు సిలబస్ బోధన
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మార్పులకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు ప్రారంభమయ్యాయి. సాధారణంగా జూన్‌లో ప్రారంభమయ్యే తరగతులను ఈసారి ఏప్రిల్ నుంచే నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 23 వరకు తరగతులు కొనసాగుతాయి. అనంతరం విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఈ మార్పులతో విద్యా కాలపట్టికను సవ్యంగా అమలు చేసి సిలబస్ పూర్తి చేయడంలో సౌలభ్యం కల్పించాలనే లక్ష్యంతో అధికారులు ముందడుగు వేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 100కి పైగా ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు కలిపి వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొత్త షెడ్యూల్ అమలుకు అనుగుణంగా అన్ని కళాశాలలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
ఫస్ట్ ఇయర్లో బ్రిడ్జి కోర్సులు..
ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు ప్రత్యేకంగా ‘బ్రిడ్జ్ కోర్సులు’ నిర్వహించాలని బోర్డు ఆదేశించింది. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్ స్థాయికి మారే విద్యార్థులకు ప్రాథమిక అంశాల్లో పట్టు పెంచడం లక్ష్యంగా ఈ కోర్సులు చేపడుతున్నారు. ముఖ్యంగా గణితం, సైన్స్, భాషా అంశాల్లో బలహీనతలను అధిగమించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది. ఇక సెకండియర్ విద్యార్థులకు వేసవి సెలవులకు ముందే కనీసం రెండు అధ్యాయాలను బోధించాలని సూచించారు.
దీని ద్వారా తిరిగి తరగతులు ప్రారంభమైన తర్వాత సిలబస్ ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. విద్యా సంవత్సరాన్ని ముందుకు జరపడం ద్వారా అకాడమిక్ సమయాన్ని విస్తరించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. బ్రిడ్జ్ కోర్సులు అమలు చేయడం ఫస్టియర్ విద్యార్థుల పునాది బలపడటానికి దోహదం చేస్తుంది. అదే సమయంలో సెకండియర్ విద్యార్థులకు ముందస్తు బోధన పరీక్షల సమయంలో ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది. మొత్తంగా జిల్లాలో ఉన్న కళాశాలల్లో ఈ మార్పులు సమర్థవంతంగా అమలైతే విద్యా ప్రమాణాలు మెరుగుపడే అవకాశముందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.
