హైదరాబాద్ : భారతీయ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు మరోసారి దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈసారి పోటీలో తెలుగు రాష్ట్రాల గౌరవం నిలబెట్టే అవకాశం లభించిందని… ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పార్టీలు అన్ని మద్దతు ఇవ్వాలని కోరారు. “పీవీ నరసింహారావు తర్వాత ఇంతటి గౌరవనీయమైన స్థానం ఒక తెలుగు వ్యక్తికి దక్కడం ప్రతి తెలుగు వాడికీ గర్వకారణం” అని పేర్కొన్నారు.
సుదర్శన్ రెడ్డి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా న్యాయ నిపుణుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని… ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదని, ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి తీసుకున్న చర్య అని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంలో సీఎం రేవంత్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కమ్యూనిస్ట్ పార్టీలు, అలాగే ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు సహా అందరు నాయకులకు విజ్ఞప్తి చేశారు. “ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వాలి” అని పిలుపునిచ్చారు.
గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ ఆయనకు మద్దతు ఇచ్చి రాజకీయ పరిణతిని చూపారని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇకపోతే, ఎన్‌డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సి.పి. రాధాకృష్ణన్‌ను ఇప్పటికే ఖరారు చేసింది. మహారాష్ట్ర గవర్నర్‌గా కొనసాగుతున్న ఆయన, గతంలో జార్ఖండ్, తెలంగాణ గవర్నర్ బాధ్యతలు కూడా నిర్వహించారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్, కోయంబత్తూరు నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఆయనకు ఉంది.