Inspections l కనకదుర్గమ్మ ఆలయంలో ఈఓ తనిఖీ

Inspections l కనకదుర్గమ్మ ఆలయంలో ఈఓ తనిఖీ
భక్తుల ఈఓ శీనా నాయక్ ముఖాముఖి
దర్శన, అన్నప్రసాదం, ప్రసాదం, పారిశుధ్యంపై నేరుగా అభిప్రాయాల సేకరణ
Inspections l ఇంద్రకీలాద్రి, ఆంధ్ర ప్రభః ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శీనా నాయక్ భక్తులతో నేరుగా ముఖాముఖి నిర్వహించి, ఆలయంలో అందుతున్న సౌకర్యాలపై సమగ్రంగా అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తుల అనుభవాలను నేరుగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈఓ తెలిపారు. ఈ సందర్భంగా దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లలో వేచి ఉండే సమయం, ప్రవేశ మార్గాల్లో క్రమశిక్షణ, ధర్మ దర్శనం, రూ.100, రూ.300, రూ.500 టిక్కెట్ల దర్శన సౌకర్యాలపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాదం నాణ్యత, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పంపిణీ విధానం, క్యూ లైన్లలో మజ్జిగ, తాగునీటి ప్యాకెట్ల సరఫరాపై స్పందన తీసుకున్నారు.
లడ్డు ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీ, నాణ్యత, టికెట్ స్కానింగ్ వద్దనే ప్రసాదం అందించే కొత్త విధానంపై భక్తుల అభిప్రాయాలను సేకరించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్టులు, బ్యాటరీ వాహనాలు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లపై నేరుగా వారితో మాట్లాడారు. ఆలయ పరిసరాల పారిశుధ్యం, ఘాట్ రోడ్డులో సౌకర్యాలు, దేవస్థానం కేటాయించే వసతి గదుల పరిశుభ్రతపై భక్తుల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆన్లైన్ దర్శన బుకింగ్, వాట్సాప్ సేవలు, మొబైల్ యాప్ ద్వారా అందుతున్న డిజిటల్ సేవల వినియోగంపై కూడా భక్తుల సూచనలు స్వీకరించారు. భక్తులు సూచించిన అంశాలను పరిశీలించి, సౌకర్యాల మెరుగుదలకు తక్షణ చర్యలు తీసుకుంటామని ఈఓ శీనా నాయక్ భరోసా ఇచ్చారు. భక్తుల సంతృప్తే దేవస్థానం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
