వినూత్నంగా నిరసన దీక్ష..
- పత్తి రైతులకు ఎకరాకు రూ 30 వేలు పరిహారం చెల్లించాల్సిందే..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : అధిక వర్షాల కారణంగా పత్తి పంట సాగుచేసి నష్టపోయిన పత్తి రైతులకు ఎకరాకు రూ 30 వేల(0 thousand per acre) నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ వివేకానంద స్వామి విగ్రహం వద్ద సామాజిక కార్యకర్త హెచ్. నరసింహ బుధవారం ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు వినూత్నంగా నిరసన చేపట్టారు. నిరసన దీక్షకు పలువురు బిజెపి నాయకులు రైతులు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త హెచ్. నరసింహ(H. Narasimha) మాట్లాడుతూ.. పత్తి, వరి, మొక్కజొన్న రైతులు అధిక వర్షాల వల్ల చాలా నష్టపోయారని అన్నారు. నారాయణపేట జిల్లాలో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు పత్తి కేవలం నాలుగు నుండి ఐదు క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక, గణాంకాశాఖ డైరెక్టరేట్(Directorate of Statistics) నివేదిక ప్రకారం పత్తి దిగుబడి తగ్గిందని నివేదిక జారీ చేసినట్లు వివరించారు.
ఈ నివేదికనే రైతులు నష్టపోయారని తెలుపుతుందని పత్తి పంటకు ఎకరాకు 30 వేల నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. 20 వరకు తేమ శాతం ఉన్న పత్తిని కూడా మద్దతు ధరకు సీసీఐ ద్వారా కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీసీఐ ఎండి లలిత్ కుమార్ గుప్త కు ఆదేశాలు జారీ చేసి రైతులకు పూటకొక కొత్త నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండటం కోసం వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి బీజేపీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

