విజయవాడ ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రిపై వేంచేసిన దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్ళు గల్లంతయ్యాయి. గతంలో పని చేసిన ఈవోల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. మాయమైన ఫైళ్ల వ్యవహారంపై ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ సంబంధిత విభాగాల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఫైళ్లను ఈవో పరిశీలించారు. ఈ క్రమంలోనే ఫైళ్ల అదృశ్యం వెలుగులోకి వచ్చింది.
కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ సంబంధించిన కేసుల ఫైళ్లు గల్లంతు అయినట్లు గుర్తించారు. ఈ ఫైళ్ల ఆధారంగానే కోర్టు కేసుల్లో కౌంటర్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఫైళ్లు కనిపించకపోవడంతో ఈవో వాటికి సంబంధించిన అధికారులను పిలిచి వివరాలు అడిగారు. ఉద్యోగులు సరైన సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. మాయమైన ఫైళ్ల గురించి గతంలో పనిచేసిన ఉద్యోగులు, ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులు సమాధానం చెప్పాలని ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నిర్లక్ష్యం కారణంగానే.. ప్రస్తుతానికి హెడ్ ఆఫీసు నుంచి ఫైళ్లు తెప్పించుకుని కోర్టులో కౌంటర్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఫైళ్లకు సంబంధించిన వివరాలను ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ ఉద్యోగులను అడగ్గా వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతోపాటు మౌనం దాల్చడంపట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో పనిచేసిన ఈవోలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఫైళ్లు మాయమయ్యాయి. ఈ ఫైలింగ్ చేయకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రస్తుత అధికారులు అంటున్నారు. ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ ఒకరే కావడంతో ఫైళ్ల గల్లంతు కు కారణమైనవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.