Indrakeeladri | ఫాల్గుణ పౌర్ణమిన‌ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం

Indrakeeladri | ఫాల్గుణ పౌర్ణమిన‌ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం

  • మర్చి 3 న దుర్గగుడి మూసివేత..
  • మార్చి 3న ఉదయం 10 గంటలకు ఆలయ కవాట బంధనం..
  • మార్చి 4న తెల్లవారుఝామున 3 గంటలకు కవాట ఉద్ఘాటన..
  • స్నపనాభిషేకాల అనంతరం భక్తులకు సర్వదర్శనం

Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : ఫాల్గుణ పౌర్ణమి మర్చి 3వ తేదీ రోజున కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతున్న సందర్భంగా, ఇంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం ప్రత్యేక ఆచరణ చేపట్టనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. వైదిక కమిటీ సూచనల మేరకు గ్రహణ కాలంలో ఆలయ నిర్వహణలో మార్పులు చేస్తూ భక్తుల సౌకర్యార్థం సమగ్ర కార్యాచరణను రూపొందించారు. మార్చి 3, మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఉప ఆలయాల కవాట బంధనం (తలుపులు మూసివేత) చేపడతారు. ఈ సమయంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణను పూర్తిగా రద్దు చేశారు.

అదే విధంగా ఉదయం నిర్వహించే శాంతి కల్యాణం, చండీ హోమం, సాయంత్రం పంచ హారతులు, పల్లకీ సేవ వంటి ఆర్జిత సేవలు కూడా గ్రహణ కారణంగా నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. గ్రహణ స్పర్శ కాలం మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభం అయి గ్రహణ మోక్ష కాలం సాయంత్రం 6 గంటల 48 నిమిషాలకు ముగింపు అవుతు మొత్తం గ్రహణ కాలం 3 గంటల 28 నిమిషాలు ఉంటుందని వైదిక కమిటీ తెలిపింది. గ్రహణ మోక్షం అనంతరం మార్చి 4, బుధవారం తెల్లవారుఝామున 3 గంటలకు ఆలయ కవాట ఉద్ఘాటన చేస్తారు. అనంతరం దేవతామూర్తులకు సుప్రభాతం, స్నపనాభిషేకాలు నిర్వహించి, ప్రాతఃకాలార్చన, నివేదన, హారతులు జరిపిన తరువాత ఉదయం 8 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.

  • ఆర్జిత సేవల్లో మార్పులు…

మార్చి 4న తెల్లవారుఝామున స్నపనాభిషేకాలు నిర్వహించే కారణంగా, సుప్రభాతం, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమం వంటి తెల్లవారుఝామున జరిగే ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే సేవలను 8.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. గ్రహణ సందర్భంలో శాస్త్రోక్తంగా చేపడుతున్న ఈ మార్పులను భక్తులు గమనించి దేవస్థాన అధికారులకు సహకరించాలని, గ్రహణ కాలంలో ఆలయ ఆచరణలు భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ నిర్వహించబడతాయని, శాస్త్ర నియమాలకు అనుగుణంగా పూజా విధానాలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply