Indrakeeladri | పొరంకి వేద పాఠశాలకు నూతన వైభవం

Indrakeeladri | పొరంకి వేద పాఠశాలకు నూతన వైభవం
- మోడల్ గురుకులంగా తీర్చిదిద్దేందుకు కృషి
- శరవేగంగా అభివృద్ధి పనులు
Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పొరంకి వేద పాఠశాల సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ సూచనలతో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి.

వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో పాఠశాల భవనానికి నూతన రంగులు అద్దుతూ, అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు. పాత నిర్మాణాలను పునరుద్ధరించి, విద్యార్థులకు సౌకర్యవంతమైన వసతులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పాఠశాల ఆవరణలో నూతన గోశాల నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి.

గోవుల సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఈ పనులను ఆలయ చైర్మన్, ఈవో ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. గోసంరక్షణతో పాటు సంప్రదాయ విలువలను కాపాడే దిశగా ఈ చర్యలు కీలకంగా నిలవనున్నాయి. ఇప్పటికే విద్యార్థుల సౌకర్యార్థం విశ్రాంతి గదుల మరమ్మతులు, ఆర్.ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, భవన స్లాబ్ మరమ్మతుల వంటి కీలక పనులను పూర్తిచేయడం జరిగింది. తద్వారా విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు మరింత మెరుగయ్యాయి.
ఈ అభివృద్ధి పనులను ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, పనుల నాణ్యతతో పాటు వేగంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించారు. వేద విద్యను అభ్యసించే విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా, పొరంకి వేద పాఠశాలను ఒక ఆదర్శవంతమైన మోడల్ గురుకులంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చైర్మన్, పాలకమండలి, కార్యనిర్వహణాధికారి, ఇంజనీరింగ్ యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తున్నట్లు దేవస్థాన వర్గాలు పేర్కొన్నాయి.
