ఇంద్రకీలాద్రిలో వైదిక కమిటీ పునర్నిర్మాణం…

ఇంద్రకీలాద్రిలో వైదిక కమిటీ పునర్నిర్మాణం…

దేవాదయ శాఖ మార్గదర్శకాలతో కొత్త బృందం అర్చకులు, వేదపండితులకు కీలక బాధ్యతలు
వైదిక కార్యక్రమాల సమర్థ నిర్వహణకు చర్యలు

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో వైదిక పరిపాలనను బలోపేతం చేయడానికి వైదిక కమిటీని పునర్నిర్మిస్తూ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు వైదిక సిబ్బందితో కమిటీని పునర్వ్యవస్థీకరించడం జరిగింది.

ఆలయంలో జరుగుతున్న నిత్య, నైమిత్తిక, ఉత్సవ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ పునర్నిర్మాణం చేపట్టినట్లు ఈఓ ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యంగా శాస్త్రోక్త విధానాల అమలు, యాగాలు, హోమాలు, ప్రత్యేక పూజల నిర్వహణలో సమన్వయం పెంపొందించడంపై దృష్టి సారించారు.

వైదిక కమిటీ సభ్యులు వీరే…

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వైదిక కమిటీకి స్థానాచార్యగా వి. శివప్రసాద్ శర్మను నియమించగా, సిహెచ్. ఆంజనేయ ఘనాపాటి, వి. శ్యావస్య మహర్షి వేదపండితులుగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన అర్చకులుగా వై. మల్లేశ్వర శాస్త్రి, ఎల్. దుర్గా ప్రసాద్ కొనసాగనున్నారు. ఉప ప్రధాన అర్చకుడిగా కె.ఎన్.వి.డి.ఏం. ప్రసాద్ నియమితులయ్యారు.

సహాయకులు సలహాదారులుగా వైదిక కార్యక్రమాల నిరాటంక నిర్వహణకు తోడ్పాటుగా యం. షణ్ముకేశ శాస్త్రి (వేదపండిట్), వి. శ్రీధర్ శర్మ (అర్చక)లను సమన్వయ సహాయకులుగా నియమించారు. అదేవిధంగా బి. శంకర శాండిల్య (ఉప ప్రధాన అర్చక), ఆర్. శ్రీనివాస శాస్త్రి (ముఖ్య అర్చక)లను సలహాదారులుగా నియమించారు. వైదిక కమిటీ సీనియర్ సభ్యుల వయోభారం, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ అదనపు నియామకాలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. ఆలయ అవసరానుసారంగా కమిటీకి మార్గదర్శకాలు, సలహాలు అందిస్తూ కార్యక్రమాల నిర్వహణలో సమన్వయం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

పారదర్శకత – సమన్వయమే లక్ష్యం..

కొత్తగా పునర్నిర్మించిన ఈ వైదిక కమిటీ ద్వారా ఆలయంలో జరిగే ధార్మిక కార్యక్రమాలు మరింత క్రమబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించబడటంతో పాటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి పెంపొందేలా చర్యలు తీసుకోనున్నారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు సేవల నాణ్యత పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించినట్లు ఈఓ శీనా నాయక్ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వచ్చినట్లు తెలిపారు.

Leave a Reply