Rain|ఆ ఒక్క రోజు ఆగవయ్యా..

Rain|ఆ ఒక్క రోజు ఆగవయ్యా..
వరుణుడికి ఫ్యాన్స్ రెక్వెస్ట్
- హైఓల్లేజ్ మ్యాచ్‌కు వర్షం గండం
- కొలంబోలో భారత్-పాక్ ‘బిగ్ ఫైట్’:
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- పొంచి ఉన్న వర్షం ముప్పు
- మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్

Rain|ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : టీ20 ప్రపంచకప్‌లో రేపు (ఫిబ్రవరి 15) భారత్, పాకిస్థాన్ మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమనాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇదే జరిగితే అభిమానులు తీవ్ర నిరాశ చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్‌ను మిస్ చేసుకోవాలని ఎవరూ కోరుకోరు. ఇలాంటి మ్యాచులు మళ్లీమళ్లీ రావు. అందుకే ఈ మ్యాచ్ ఎలాగైనా జరగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వరుణ దేవా.. కాస్త ఆగవయ్యా.. మ్యాచ్ అయిపోయే వరకు కరుణించవయ్యా అని ఫ్యాన్స్ వేడుకుంటున్నారు.

ఆట సాగేనా..?
కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న భారత్, పాక్ పోరుకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఈ బిగ్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. “15వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావంతో కొలంబోలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందు సాయంత్రం 5 గంటలకు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే, మ్యాచ్ సమయంలో వర్షం పడే సూచనలు తక్కువేనని తెలిపింది. ఆట జరిగేటప్పుడు వాతావరణం మేఘావృతమై, ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని అంచనా.

వర్షం వస్తే ఎలా..?
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో వర్షం వస్తే ఐసీసీ టీ20 నియమాలు వర్తిస్తాయి. వర్షం పడితే ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. చివరికి ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. అందుకు కూడా వీలుకానిపక్షంలో మ్యాచ్ ను రద్దు చేస్తారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. పాకిస్థాన్ వర్సెస్ భారత్ మ్యాచ్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కాబట్టి.. ఈ మ్యాచ్ రద్దయినా రిజర్వ్ డేలు ఉండవు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో ఇరు జట్లు 8 సార్లు తలపడగా, భారత్ 7-1 ఆధిక్యంలో ఉంది.

