T20 cricket| అదే జోరు.. అదే ఊపు కొన‌సాగాలి

అదే జోరు.. అదే ఊపు కొన‌సాగాలి

  • నేడు భారత్ – న్యూజిలాండ్ రెండో టీ 20
  • గాయం కారణంగా అక్షర్ పటేల్ దూరం
  • కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణాకి అవకాశం

T20 cricket| వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : న్యూజిలాండ్‌పై తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ రెండో టీ20కి సిద్ధమైంది. సెకండ్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించాలని చూస్తోంది. రాయ్‌పూర్ వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య రాత్రి 7 గంటలకు రెండో టీ20 జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు మరో విజయంపై కన్నేసింది. నాగ్‌పూర్‌లో జిరగిన తొలి మ్యాచ్ లో 48 పరుగుల తేడాతో గెలిచిన 5 టీ20ఐల సిరీస్‌ను ప్రారంభించింది. అభిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడగా, రింకు సింగ్ కేవలం 20 బంతుల్లో 44 పరుగులు చేసి చివరిలో దడదడలాడించాడు. అనంతరం శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో న్యూజిలాండ్ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అయితే, అక్షర్ పటేల్ క్యాచ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ వేలికి గాయమై న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మధ్యలో మైదానం వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీంతో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

T20 cricket|అక్ష‌ర్‌కు గాయం..
అయితే, అక్షర్ పటేల్ గాయం, బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా జట్టులో కీలక మార్పులు తప్పవని తెలుస్తోంది. డారిల్ మిచెల్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో వేలికి గాయం కావడంతో అక్షర్ మైదానం విడిచిపెట్టాడు. టీ20 వరల్డ్ కప్ 2026ను దృష్టిలో పెట్టుకుని అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లకు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

T20 cricket|షేక్ చేస్తున్న అభిషేక్‌
అభిషేక్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నాడు. సంజు శాంసన్ మరోసారి అతనితో కలిసి బ్యాటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. కానీ అతను టీ20 ప్రపంచ కప్ జట్టులో ఉన్నాడనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్‌కు మరో అవకాశం లభించవచ్చు. అక్షర్ ఈ మ్యాచ్ కు దూరమయ్యే అవకాశం ఉన్నందున, రింకు మరోసారి ఫినిషర్ పాత్ర పోషించాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.

T20 cricket|పూర్ ఫామ్‌లో వారిద్ద‌రూ..
ముఖ్యంగా టాప్‌ఆర్డర్‌లో సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ నిరాశపరిచారు. పేలవమైన షాట్‌ సెలక్షన్‌తో ఇద్దరూ చాలా తేలిగ్గా వికెట్లు కోల్పోయారు. అవకాశాలు వరుసగా లభిస్తున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజు శాంసన్‌ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. మరోవైపు రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగొచ్చిన ఇషాన్‌ కిషన్‌ కూడా పట్టుదలతో ఆడలేకపోయాడు. రెండో టీ20లో శాంసన్‌, కిషన్‌ ఫామ్‌లోకి రావడం భారత్‌కు కీలకంగా మారింది.

T20 cricket|తక్కువ అంచనా వేయొద్దు
తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికీ న్యూజిలాండ్‌ పోరాటంలో ఏమాత్రం తగ్గలేదు. కివీస్‌ను తక్కువగా అంచనా వేస్తే సూర్య సేనకు చేదు అనుభవం తప్పదని క్రికెట్‌ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కసితో బరిలో దిగనున్న న్యూజిలాండ్‌ను ఆపాలంటే భారత్‌ మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూపర్‌ ఫామ్‌లో ఉన్న డారిల్‌ మిచెల్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ నుంచే భారత్‌కు ప్రధాన ప్రమాదం పొంచి ఉంది. వీరిద్దరినీ వీలైనంత త్వరగా పెవిలియన్‌కు చేర్చడం అత్యంత కీలకం. తొలి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించని ఓపెనర్‌ డెవోన్‌ కాన్వే కూడా ప్రమాదకర ఆటగాడేనని భారత బౌలర్లు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మిడిల్‌ ఓవర్లలో కివీస్‌కు కళ్లెం వేయగలిగితేనే రెండో టీ20లో భారత్‌ ఆధిక్యం కొనసాగించే అవకాశం ఉంటుంది.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

Leave a Reply